Chamala Kiran Kumar Reddy: భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పదవులు పొందడం కంటే వాటిని నిలబెట్టుకోవడం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ముఖ్యమని స్పష్టం చేశారు. కేవలం తమకు నచ్చిన వారికి కాకుండా ప్రజల మధ్య ఉండి పనిచేసే వారికే పదవులు ఇవ్వడం వల్ల పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల సమయంలో పాత కక్షల వల్ల నాయకుల మధ్య సమన్వయం లోపించిందని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికలు లేని సమయం కాబట్టి అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాయకులు విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 90 మందికి లబ్ధి చేకూరినా.. పథకం అందని పది మందితో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కొన్ని శక్తులు అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఎంపీ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందనే భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల కోసం పనిచేస్తేనే ఎవరికైనా గుర్తింపు లభిస్తుందని.. తానైనా సరే పని చేయకపోతే ఎంపీ ఎవరనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ మొదటిసారి గెలవడానికి పార్టీ గుర్తు కారణమని కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. అప్పుడు తన వద్ద ప్రోగ్రెస్ రిపోర్ట్ లేకపోయినా ప్రజలు గెలిపించారని.. మళ్ళీ గెలవాలంటే తన పనితీరు మాత్రమే ప్రామాణికమని చెప్పారు. ప్రజలకు మంచి చేయకపోతే ఓటర్లే తనను తిరస్కరిస్తారని వెల్లడించారు. తాను కేవలం వంద ఓట్ల ఓనర్ అయిన సామాన్య ఓటరుకు మాత్రమే భయపడతానని.. ఎవరో వచ్చి ఏదేదో చెబితే వినే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లా ముఖ్య నాయకులు.. కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: Building Rules: భవన నిర్మాణాలకు కొత్త రూల్స్.. 20 అంతస్తులు దాటితే ఈ నిబంధనలు పాటించాల్సిందే!