MP Raghunandan: కేటీఆర్, హరీష్ రావు, కవితను కాదు నేరుగా కేసీఆర్ ను జైలుకు పంపించే వాళ్లం. కవితా.. ఆడబిడ్డవు కాబట్టి నా సమాధానం ఇలా ఉంది. లేకుంటే వేరేలా ఉండేదంటూ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. నిజామాబాద్ పర్యటనలో కవిత చేసిన కామెంట్స్ పై ఎంపీ సీరియస్ అయ్యారు.
నిజామాబాద్ పర్యటనలో కవిత మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తే, కేసులంటూ భయపెడుతోందన్నారు. ఎవరు ప్రశ్నిస్తే, వారిపై కేసులు పెట్టడం, వేధించడం బీజేపీకి పరిపాటిగా మారిందని కవిత విమర్శించారు. బెదిరింపు రాజకీయాలు బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈ కామెంట్స్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. బీజేపీ ఎవరిని భయపెట్టదని, కవిత ఆడబిడ్డ కాకపోతే తన సమాధానం వేరేలా ఉండేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు పట్టిన దరిద్రంగా విమర్శించిన ఎంపీ, ఎక్కువ ఎగిరిపడితే జనాలు మళ్ళీ బండకేసి కొడతారంటూ జోస్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లొచ్చిన ఉదంతంపై, దర్యాప్తు సంస్థలు తప్పు చేసిన వారిని ఏ కలుగులో దాక్కున్నా పట్టుకువచ్చి విచారణ చేస్తాయన్నారు.
కవిత తన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని రఘునందన్ డిమాండ్ చేశారు. మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్, హరీష్ రావు, కవిత అక్కర్లేదని, నేరుగా కేసీఆర్ నే మొదట జైలుకు పంపించే వారమన్నారు. ఎవరు తప్పు చేసినా పోలీసులు కేసులు పెడతారని, కోర్టులోకి తీసుకువెళ్లడం చట్టమన్నారు. మీపై కేసులకు ప్రధాని మోడీకి అసలు ఏంటి సంబంధం అంటూ ప్రశ్నించిన ఎంపీ, ఇప్పటికైనా మారాలని హితవు పలికారు. మీరంతా ఆల్రెడీ సచ్చినా పాములని, మీకు పాలు పోసినా, నీళ్లు పోసినా, వచ్చేది లేదు సచ్చేది లేదంటూ రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు.
Also Read: DGP Jitender: అల్లు అర్జున్ కేసుపై స్పందించిన డీజీపీ.. ఏం చెప్పారంటే?
మీ జోలికి బీజేపీ రావట్లేదని, మీ చావు మీరు చావండంటూ ఎంపీ సీరియస్‌గా వ్యాఖ్యానించారు. మీడియాలో హైలెట్ అయ్యేందుకు కేటీఆర్, హరీష్, కవిత ఎక్కడో ఓ చోట ఏదో ఒకటి మాట్లాడుతున్నారని, మీరు తప్ప తెలంగాణలో ప్రతిపక్షంలో ఎవరు లేరా అంటూ రఘునందన్ ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేసిన కవిత, మంత్రి పదవి ఇచ్చి ఎదుగుతుంటే ఈటల రాజేందర్ ను ఓర్వలేక తీసేశారన్నారు. కేసీఆర్ తన నిజాయితీ నిరూపించు కొనేందుకు బీసీలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మొత్తం మీద కవితను ఉద్దేశించి రఘునందన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారాయి.