Maoists Killed in Mulugu District: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్… ఏడుగురు మావోయిస్టులు మృతిమావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో తాజాగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. మృతిచెందిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్టు సమాచారం. ఏటూరునాగారం మండలంలోని కొండాయి చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్ లో మొత్తం ఏడుగురు సభ్యులు మృతి చెందారు. మృతుల్లో 1. కుర్సం మంగు అలియాస్ భద్రు, అలియాస్ పాపన్న, TSCM, సెక్రటరీ యెల్లందు, నర్సంపేట, ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు, DVCM, కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్, ముస్సాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ముస్సాకి జమున, జైసింగ్ (పార్టీ సభ్యుడు) కిషోర్ (పార్టీ సభ్యుడు), కామేష్ (పార్టీ సభ్యుడు) ఉన్నారు.
కొద్దిరోజుల క్రితమే ములుగు జిల్లాలో ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకులను మావోయిస్టులు హతమార్చారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేతస్తున్నారని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనంతరం మావోయిస్టులను హెచ్చరిస్తూ గిరిజన యువత పేర్లతో బహిరంగ లేఖలు జిల్లాలో దర్శనం ఇచ్చాయి. మరోవైపు కొన్ని నెలలుగా మావోయిస్టులను బలగాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అడవుల్లో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతూ హతమారుస్తున్నారు.
Also read: బాలినేనికి లక్కీఛాన్స్.. మంత్రి పదవి కన్ఫామ్?
వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండంతో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒక్కో ఎన్కౌంటర్ లో 20 నుండి 30 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం ఆ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఎన్ కౌంటర్లు పరిష్కారం కాదని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఏడుగురు మృతి చెందగా గత నెల 22న చత్తీస్గడ్ లోని భిజీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో పదిమంది మావోలు కన్నుమూశారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీస్ సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు.