మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు అన్ని పార్టీల నుంచి ఆఫర్లు వస్తుంటే.. ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆయా పార్టీల పెద్దలు, ఓటర్లను వేడుకుంటున్నట్టు తెలుస్తున్నది. సాధారణంగా ఎన్నికల్లో పార్టీల గుర్తుల మీద పోటీ చేసిన అభ్యర్థులు.. ప్రచారం కోసం పార్టీల ఇచ్చిన డబ్బుల కంటే సొంతంగా రూ.లక్షలు ఖర్చు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులు రూ.2లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేయరాదని ఎన్నికల సంఘం షరతు విధించిన విషయం తెలిసిందే.అయితే, బయటకు తెలియకుండా ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల పోలింగ్ రేపు అనంగా..ముందు రోజు రాత్రి ఓటుకు రూ.5వేలు.. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.10 వేల వరకు పంపిణీ చేసినట్టు సమాచారం.
మున్సిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీలు, స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు ప్రధాన పార్టీలు భారీగా డబ్బులు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. వారిని క్యాంప్ రాజకీయాల పేరిట గోవా, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు తరలించి తమకే మద్దతు ఇవ్వాలని.. ఇతర పార్టీలోకి జంప్ కాకుండా ఉండేందుకు నగదు, ఖరీదైన బహుమతులు ఆఫర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పార్టీ గుర్తుమీద గెలిచిన అభ్యర్థులు అధికారపార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం. గెలిచిన అభ్యర్థుల దగ్గర నుంచి ఫోన్లు లాక్కుని మరీ వారిని క్యాంపులకు తరలిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇదిలాఉంటే వచ్చేసారి మరల తమకు అవకాశం వస్తుందో రాదో..లేకపోతే రిజర్వేషన్ పరంగా సైతం కలిసివస్తుందో రాదో అని భయంతో.. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని భావించిన కొందరు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అధికార పార్టీ ఆఫర్ చేస్తున్న దానికి జై కొట్టి పార్టీ కండువా మారుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇక మేయర్, చైర్మన్ పదవులు ఆశించే వ్యక్తులు భారీగా డబ్బులు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా అధిష్టానాన్ని ఒప్పించి మిగతా వారి మద్దతు కూడ గట్టేందుకు రూ.కోట్లు కుమ్మరించేందుకు సైతం ముందుకు వస్తున్నట్టు టాక్.రూ.10 లక్షల నగదుతో పాటే కారు సైతం ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం. చైర్మన్, మేయర్ స్థానం కోసం పొటీ పడుతున్న అభ్యర్థులు ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్ అభ్యర్థుల ఖర్చు సైతం భరించినట్టు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో అయితే ముందే పెద్దమొత్తంలో పార్టీ పెద్దలు, ఇన్చార్జి మంత్రులు డిపాజిట్ చేయించుకున్నట్టు సైతం కథనాలు వచ్చాయి. గెలిచిన వారికి మున్సిపల్ ఎన్నికలు పెద్దమొత్తంలో సంపాదించుకునే అవకాశం కల్పిస్తుండగా.. ఓడిన వారిని మాత్రం పుట్టెడు అప్పుల్లో ముంచినట్టు తెలుస్తోంది.
Balka Suman: మున్సిపల్ ఎన్నికలు.. బాల్క సుమన్ వ్యూహం, క్యాంపు రాజకీయాలతో వేడెక్కిన చెన్నూరు!
మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్, పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు.. పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లకు పంచిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. వార్డులు, డివిజన్ స్థాయిల్లో ఇంటింటికీ వెళ్లి ఒట్టు వేయించుకుని మరీ ఓటు నాకే వేశారా? లేదా ఇతర పార్టీలకు వేశారా? అని అడుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఒకవేళ తమ దగ్గర డబ్బులు తీసుకుని వేరే పార్టీకి ఓటు వేసినట్టు వారు అంగీకరించినా? లేక ఒట్టు వేసి చెప్పకపోయినా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇదే తంతు కొనసాగుతున్నట్టు తెలుస్తుండగా.. మరోవైపు చైర్మన్, మేయర్‌గా పోటీకి సిద్దపడి ముందే పార్టీ పెద్దల వద్ద డబ్బులు డిపాజిట్ చేసి ఓడిపోయిన వారు సైతం తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని లాబీయింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.