Telangana : మటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్‌వెజ్ ప్రియులంతా లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. ఫంక్షన్లలో వండే మటన్ టేస్ట్ మరో రేంజ్‌లో ఉంటుంది. భోజనాల్లో చికెన్ పెడితే చీప్‌గా చూస్తుంటారు. అదే మటన్‌తో దావత్ ఇస్తే మాత్రం.. ధూంధాం సందడే. మటన్ భోజనం కోసం ఎగబడుతుంటారో ఊర్లళ్లో జనం. అంతెందుకు, సండే వస్తే సిటీల్లో మటన్ షాపుల ముందు పెద్ద క్యూ లైన్లే ఉంటాయి. హైదరాబాద్‌లోనైతే గంటల తరబడి నిలబడితే కానీ మటన్ దొరకని పరిస్థితి. సండే, మటన్ కర్రీ.. ఆ కాంబినేషనే వేరబ్బా. ఫంక్షన్, మటన్ భోజనం.. ఆ మజానే వేరే లెవల్.
పెళ్లిళ్లో మటన్ కోసం గొడవలు జరిగిన ఘటనలు తెలంగాణలో అనేకం ఉంటాయి. ముక్కలు వేయలేదని కొందరు, బొక్కలు పడ్డాయని ఇంకొందరు, సూప్ మాత్రమే వేస్తున్నారని మరికొందరు.. ఇలా మటన్ చుట్టూ ముష్టియుద్ధాలు చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు కొన్ని విషాద సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. అలాంటిదే ఓ అనూహ్య పరిణామం ఈ ఉదంతం.
నిజామాబాద్ జిల్లా బొప్పాస్‌పల్లికి చెందిన 48 ఏళ్ల రుత్వాన్ తారాసింగ్ బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు. విందులో మటన్ వడ్డించారు. మటన్ ముక్కలు ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. సడెన్‌గా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. మింగలేక, కక్కలేక పోయాడు. నీళ్లు తాగినా ముక్క కదల్లేదు. శ్వాస పీల్చడం కూడా కష్టమైపోయింది. అతను కిందపడిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మటన్ ముక్క అడ్డుపడడంతో శ్వాస ఆడక ఊపిరి ఆగిపోయిందని డాక్టర్లు చెప్పారు.
తారాసింగ్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇప్పుడా కుటుంబం ఇంటిపెద్దను కోల్పోయింది. మటన్ పీస్ ఆ ఫ్యామిలీని రోడ్డున పడేసింది. విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. జరిగిన ఘటనపై తెగ చర్చించుకుంటున్నారు.
Also Read : పెళ్లి భోజనం బాలేదంటే.. కాల్చి పడేసిన బంధువులు