Wedding Feast Murder| పెళ్లి అంటే ఒక వేడుక. బాజా, బజంత్రీలు, స్నేహితులు, బంధువులు అంతా కలిసి సరాదాగా గడిపేందుకు మంచి అవకాశం. అయితే కొన్నిసార్లు పంతాలకుపోయి ఈ సంతోషమే విషాదంగా మారుతుంది. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక పెళ్లిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లా రోషన్ నగర్ లో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో హాత్రస్ కు చెందిన అరుణ్ కుమార్ (37), లలిత్ కుమార్ అనే ఇద్దరు సోదరులు పెళ్లికొడుకు తరపున అతిథులుగా వచ్చారు. అయితే అక్కడ వివాహ వేడుకలు అన్నీ పెద్దమనిషిగా పెళ్లికూతురు మేనమామ విజయ్ కుమార్ (50) చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో భోజనాల వద్దకు వెళ్లారు. అక్కడ భోజనం చేస్తూ అరుణ్ కుమార్.. అసంతృప్తి వ్యక్తం చేశాడు. భోజనం ఏ మాత్రం రుచికరంగా లేదని.. అంతా నాణ్యత లేని సరుకుతో వంటలు చేశారని కామెంట్ చేశాడు.
ఇదంతా పక్కనే ఉన్న పెళ్లికూతురు మేనమామ విజయ్ కుమార్ విన్నారు. పెళ్లికి వచ్చి సంతోషంగా ఉండాల్సిన వేళ ఇలాంటి మాటలు సరికాదు అని మందలించాడు. దాని అరుణ్ కుమార్.. వచ్చిన అతిథులకు సరిగా మర్యాదలు చేయలేదు కానీ.. నీతులు చెబుతారా? అని ఎదురు చుప్పాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అరుణ్ కుమార్ మాటలకు ఆగ్రహం చెందిన విజయ్ కుమార్.. తన వల్ల ఉన్న లైసెన్స్ లేని తుపాకీతో అరుణ్ కుమార్ తలకు గురి పెట్టి కాల్చేశాడు. దీంతో అరుణ్ కుమార్ సోదరుడు లలిత్ కుమార్ వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు అరుణ్ కుమార్ మరణించాడని ధృవీకరించారు.
పోలీసులు పెళ్లికూతురు మేనమామ విజయ్ కుమార్ పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. హత్యకోసం ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: హోటల్ గదిలో బిజినెస్‌మ్యాన్ శవం.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన మహిళ
ఇలాంటిదే మరో ఘటన ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో జరిగింది. అక్కడ బాల్ఘాట్ ప్రాంతంలో చౌహాన్ కులానికి చెందిన సామాజిక వర్గం ఒక విందుభోజన ఏర్పాటు చేశారు. అర్జున్ చౌహాన్ అనే వ్యాపారవేత్త తన బాడీగార్డ్ ఆసిఫ్ ఖాన్ తో అతిథిగా వెళ్లాడు. అయితే అర్జున్ చౌహాన్ ఊబకాయుడు. అతని ఊబాకాయాన్ని ఎగతాళి చేస్తూ.. అనిల్ చౌహాన్, శుభం చౌహాన్ అనే ఇద్దరు వ్యక్తులు కామెంట్లు చేశారు. దీంతో అర్జున్ చౌహాన్ వారిపై ఆగ్రహించాడు. అక్కడ గొడవ జరుగుతుండగా.. అందరూ కలుగజేసుకొని నిలువరించారు.
కానీ కార్యక్రమం పూర్తి అయిన తరువాత అనిల్ చౌహాన్, శుభం చౌహాన్ హైవే పై వెళుతుండగా వారిని అర్జున్ చౌహాన్ తన బాడీగార్డ్ తో కలిసి కారులో వెంబడించాడు. వారిని అడ్డుకొని తుపాకులతో ఆ ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఆ తరువాత వారిని అక్కడే వదిలేసి పారిపోయారు. కానీ స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు పోలీసులు అర్జున్ చౌహాన్, అతని బాడీ గార్డ్ ఆసిఫ్ ఖాన్ ని అరెస్ట్ చేశారు.