Garuda Purana: నరకలోకం ఎలా ఉంటుందో తెలుసా..? అక్కడ తప్పులు చేసిన ఆత్మలకు ఎలాంటి శిక్షలు విధిస్తారో తెలుసా..? అతి భయంకరమైన నరకలోకానికి ఆత్మ వెళ్లగానే ఏం జరుగుతుందో తెలుసా..? నరకలోకంలో విధించే శిక్షల గురించి గరుడపురాణం ఏం చెప్తుంది. మనిషి మరణిచిన తర్వాత జరిగే పరిణామాలను గరుడపురాణం ఎలా వివరిచిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరైనా తప్పులు చేస్తే నరకానికి పోతారు అని హిందువులు గట్టిగా విశ్విస్తారు. కర్మానుసారం నరకంలో శిక్షలు అనుభవించాలని చెప్తుంటారు. అయితే వ్యాస మహర్షి రాసిన గరుడపురాణం ప్రకారం మనుషులు చేసిన తప్పులకు మరణించిన తర్వాత వివిధ రకాల శిక్షలను అనుభవించాలట. గరుత్మంతుడు ఒకనాడు శ్రీ మహా విష్ణువుతో మరణం అంటే ఏంటి..? ఒక జీవి మరణించిన తర్వాత ఏం జరుగుతుందని అడగ్గా.. శ్రీ మహా విష్ణువు గరుత్మంతుడి సందేహాలను తీర్చే సంభాషణే గరుడపురాణంగా ప్రసిద్ది చెందింది. అష్టాదశ పురాణాలలో ఈ గరుడ పురాణం ఒకటి. ఈ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలు ఉంటాయి. ఇందులో మొత్తం మూడు కాండలు ఉంటాయి. అవి ఆచార కాండ, ప్రేత కాండ, మోక్ష కాండ. మొదటి కాండను పూర్వకాండమని.. చివరి రెండు కాండలను కలిసి ఉత్తర కాండ అంటారు.
ఆచార కాండలో 240, ప్రేత కాండలో 50, మోక్ష కాండలో 30 ఆధ్యాయాలు ఉంటాయి. మనుషులు చేసే పాపాలు వాటికి నరకలోకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటి ప్రాయశ్చితం కోసం చేసే మార్గాలు, పుణ్యం సంపాదించుకోవడానికి మార్గాలు పితృకార్యాలు వాటి వర్ణన ఉంటుంది. ఇక గరుడ పురాణంలో మొత్తం 14 లక్షల నరకాల గురించి చెప్పబడింది. ప్రతి నరకం ఒక నిర్ధిష్ట పాపానికి సంబంధించిన శిక్షను కలిగి ఉంటుంది. పాపాలు చేసిన వారు యమపురికి దక్షిణ ద్వారం గుండా ప్రవేశించి అక్కడ యమధర్మరాజు విధించే శిక్షలకు అనుగుణంగా వివిధ నరకాల్లో శిక్షలను అనుభవించాల్సి ఉంటుంది.
ఇతరుల ఆస్తులను ఆక్రమించిన వారి ఆత్మలను తామిశ్రమనరకానికి తీసుకెళ్లి అక్కడ వాళ్లు అపస్మారక స్థితికి వెళ్లే వరకు శిక్షిస్తారట. స్వార్థంతో జీవించే వారిని అంధతమిస్ర్త నరకంలో వేధిస్తారు. రత్నాలు, లోహాలు దొంగిలించే వారిని తప్తమూర్తినరకానికి తీసుకెళ్లి అగ్నిలో ముంచేస్తారు. ఇక పెళ్లి కాకుండానే శారీరక సంబంధాలు పెట్టుకుని ద్రోహం చేసేవాళ్లను రక్తం, మలం జంతు విసర్జనాలతో కూడిన బావిలాంటి పుయోదక నరకంలో శిక్షిస్తారు. తమ స్వార్థం కోసం జంతువులను హింసించి చంపేవారిని కుంభీపాక నరకంలో సలసల కాగుతున్న వేడి నూనెలో వేసి హింసిస్తారు. మద్యం సేవించే బ్రాహ్మణులను విల్పక నరకంలోని అగ్నిలో వేసి శిక్షిస్తారు. అబద్దాలు చెప్తూ జీవించే వారిని అవిసి నరకంలో శిక్షిస్తారు.
ఇతరులో శారీరక సంబంధాలు బలవంతంగా పెట్టుకునే వారిని, అత్యాచారాలు చేసే వారిని లాలాభక్ష నరకంలో శిక్షిస్తారు. పెద్దలను గౌరవించని వారిని కాలసూత్ర నరకంలో అత్యంత వేడి ప్రదేశంలో నిలబెట్టి శిక్షిస్తారు. ఆవులను చంపిన వారిని రక్తంతో ముళ్లకంచెలతో అతి భయంకరంగా ఉండే మహావీచి నరకంలోకి తీసుకెళ్లి శిక్షిస్తారు. ఇక అపరిచిత వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకున్న మహిళలను శాల్మలీ నరకంలో మండుతున్న ముళ్లలో వేసి శిక్షిస్తారు. ప్రకృతిని ధ్వంసం చేసి చెట్లను నరికిన వారిని వజ్రకుతార నరకంలో శిక్షిస్తారు. ఇక వడ్డీ వ్యాపారాలు చేసి అధిక డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను పీడించే వారిని తేళ్లతో నిండిన దుర్దర నరకానికి పంపిస్తారు. ఇక తల్లిదండ్రులను తోబుట్టువులను వేధించే వారు వచ్చే జన్మ పొందలేరు. వారు గర్భంలోనే చనిపోతారని గరుడపురాణంలో ఉంది. ఇలా 14 లక్షల నరకాలలో ఆయా తప్పులకు ఆయా రకాలైన శిక్షలు ఉంటాయని గరడుపురాణం చెప్తుంది.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు