
Naveen Kumar Yadav | కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. చినుకు చినుకు ఏకమై వరదలా.. నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మజ్లిస్-బీఆర్ఎస్ కుట్రల వ్యూహాలు గమనిస్తున్న నాయకులు హస్తం కండువా వేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్య నేత నవీన్ కుమార్ యాదవ్ అజారుద్దీన్‌కి మద్దతు పలికారు. ఆయన రాకతో హైదరాబాద్ పరిధిలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవీన్ యాదవ్‌కి మంచి రాజకీయ భవిష్యత్ కల్పిస్తామన్నారు. ఆయన రాక జూబ్లీహిల్స్‌లో గేమ్ చేంజర్‌గా మారనుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. గెలుపు దిశగా వ్యూహాలకు నేతలు పదును పెడుతున్నారు. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అసంతృప్తులు, స్వతంత్రులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ వియషయంలోనూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సకెస్స్ అవుతున్నారు. ప్రత్యర్థి పార్టీల పన్నాగాలు పారకుండా బ్రేక్ వేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో మంచి పట్టున్న నేత నవీన్‌యాదవ్‌ను పార్టీలో చేరాలని కోరుతూ సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నవీన్‌యాదవ్ హస్తం కండువా కప్పుకున్నారు. నవీన్ యాదవ్ రాకతో కాంగ్రెస్ బలం మరింత పెరింగిందన్నారు రేవంత్‌రెడ్డి. ఎంఐఎం టికెట్ ఆశించి భంగపడ్డ నవీన్‌యాదవ్‌కు బీజేపీ గాలెం వేసింది. ఈ మేరకు ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. అయితే నవీన్ యాదవ్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు.
జూబ్లీహిల్స్ 2014లో ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. ఆయనకు 41 వే656 ఓట్లు వచ్చాయి. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల 816 ఓట్లు సంపాదించుకున్నారు. మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ నేతలు బుజ్జగించడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకుని హస్తం గూటికి చేరారు. ఫలితంగా దాదాపు 20వేల ఓటు బ్యాంకు ఉన్న నాయకుడు కాంగ్రెస్‌కి అండగా నిలిచినట్లైంది. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్‌కు 10వేల ఓటర్ల మద్దతు ఉంది. ఆయన గతంలో రెండు సార్లు ఓడిపోవడం సహా మజ్లిస్ పార్టీ టికెట్ ఇవ్వలేదనే సానుభూతితో ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్ యాదవ్‌ను కలసిన అజారుద్ధీన్ మద్దతు కోరగా.. ఆర్వో ఆఫీసుకు వెళ్లి నామినేషన్ ఉపసంహరించుకున్నారు.
జూబ్లీహిల్స్‌లో కేవలం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ని ఓడించడమే లక్ష్యంగా ఎంఐఎం పావులు కదిపింది. గతంలో నవీన్ యాదవ్‌ను పోటీకి దింపిన మజ్లిస్ పార్టీ ఈసారి మైనార్టీకి టికెట్ ఇచ్చింది. మైనార్టీ నేతల మధ్య పోటీ జరిగితే అజారుద్దీన్‌ను ఓడించాలనేది మజ్లిస్-బీఆర్ఎస్ ప్లాన్. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ని గెలిపించేలా అడుగులు వేశారు. అవసరం ఉన్నప్పుడు తనని పావులా వాడుకున్నారని .. ఇప్పుడు మాత్రం స్వార్థ రాజకీయాల కోసం టికెట్ ఇవ్వలేదని గమనించిన నవీన్ యాదవ్.. అజారుద్దీన్‌కు మద్దతుగా నిలిచారు. మజ్లిస్ పార్టీ మైనార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి బ్రేక్ వేసేలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలన్నీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కి కలిసి వస్తున్నాయి.
జూబ్లీహిల్స్, గోషామహల్ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ పొలిటికల్ అజెండాలను ముస్లిం నేతలు కూడా గమనిస్తున్నారు. ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారో అంచనా వేయలేమా అని ఆగ్రహంగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో MIM తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందనే సంకేతాలిస్తున్నారు.