Nizamabad Mothe Village | కేసీఆర్ దత్తత మాట.. ఉత్తమాటేనంటున్న మోతె గ్రామవాసులు

Nizamabad Mothe Village | కేసీఆర్ దత్తత మాట.. ఉత్తమాటేనంటున్న మోతె గ్రామవాసులు

Share this post with your friends

Nizamabad Mothe Village | బీఆర్ఎస్‌ అధినేత హామీ ఇస్తే ఇక అంతే సంగతులా? అందులోనూ దత్తత తీసుకుంటాను అంటే ఉత్తమాటేనా? అంటే నిజామాబాద్‌ జిల్లా మోతె గ్రామాన్ని చూస్తే ఎవరికైనా ఇదే నిజమనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం ఊరు రూపులేఖలు మారుస్తానని గొప్పలు చెప్పిన సార్‌ ఆ మాటే విస్మరించారు. తాజాగా ఎన్నికలు జరుగుతుండగా తమలా మరెవరూ మోసపోవద్దని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఊరినే పట్టించుకోని పెద్దసార్‌.. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఏం ఉద్దరిస్తారని నిలదీస్తున్నారు. కేసీఆర్‌ మోసపు వాగ్ధానాలు నమ్మొద్దని.. ఎవరికైనా నమ్మకం కలగకపోతే ఓసారి తమ ఊరికి రావాలని కోరుతున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సహా ఏదడిగితే అది ఇస్తానంటూ అల్లా ఉద్దీన్‌ అద్భుత దీపం కథలు చెప్పారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మోతె గ్రామం అభివృద్ధికి నోచుకోక వెలవెల బోతోంది. 2001లో ప్రారంభమైన మలివిడత తెలంగాణ ఉద్యమానికి మోతె గ్రామస్తులు రాజకీయ పార్టీలకి అతీతంగా ఏకతాటిపై నిలిచి మద్దతు పలికారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోని చాలా పల్లెలు ‘మోతె’ బాటలో నడిచాయి. నాటి ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ రాష్ట్రంలో పర్యటించి ఇక్కడి మట్టి ఎంతో పవిత్రమైనదని… తెలంగాణ రావాలని కోరుకుంటూ గ్రామంలో ముడుపుకట్టారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 మార్చి 28న మోతె గ్రామానికి వెళ్లి ముడుపు విప్పారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామాభివృద్ధికి స్పెషల్ ఆఫీసర్‌ని నియమించి, సెక్రటేరియట్ నుంచి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. కానీ, నేటి వరకు స్పెషల్ ఆఫీసర్‌ నియామకం అతీగతీ లేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్న హామీ అటకెక్కింది. 200 ఇళ్లు కావాలని గ్రామస్థులు అడిగితే.. ఇంకో 10 ఎక్కువ ఇస్తామన్నారని .. ఎప్పుడు అడిగినా ఊర్లో సరిపోను జాగా లేదని అధికారులు దాటవేశారని జనం వాపోతున్నారు. గ్రామం గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత మండలంలోనే ఉన్నా పట్టించుకోవడం లేదంటున్నారు.

మోతె గ్రామంలో 4,115 మంది జనాభా ఉన్నారు. వాళ్లలో 2,763 మంది ఓటర్లు. ఇక్కడివారికి ప్రధాన జీవనాదారం వ్యవసాయం. చెంతనే రెండు నదులు ఉన్నా సాగునీరు లేదు. ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడంతో పుష్కలంగా… 100 శాతం సాగునీరు వస్తుందని రైతులు ఆశించారు. అలాగే ఎర్రజొన్న రైతుల బకాయిలను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అయితే 9 ఏళ్లు దాటినా ఏ ఒక్క హామీ నేటికీ నెరవేర్చలేదంటున్నారు మోతె గ్రామస్థులు. తాము పలుమార్లు వెళ్లి కలిసి సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 సార్లు జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. మోతె గ్రామాభివృద్ధిపైన మాత్రం మాట్లాడలేదని చెప్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిని హైదరాబాద్‌ వెళ్లి కలిసినా హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలు రాగానే ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత గ్రామం వైపు చూడటం లేదంటున్నారు. ప్రభుత్వ నిధులతో అడపాదడపా పనులు జరిగాయని ప్రత్యేకంగా కేసీఆర్‌ ఫోకస్‌ చేసిందేమీ లేదంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి స్పెషల్ ఫండ్ మంజూరు చేయలేదని మండిపడుతున్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ కింద 35 లక్షలు, వివిధ మార్గాల్లో 24 లక్షలు, పంచాయతీ పన్నుల రూపంలో 15 లక్షలు ఇలా మొత్తం 74 లక్షలు ఏటా వస్తున్నాయంటున్నారు. గతంలో చేసిన పనులైనా నాణ్యంగా ఉండేవని.. కేసీఆర్‌ హయాంలో కట్టించిన చెక్‌ డ్యామ్‌లు కూడా కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెక్‌డ్యామ్‌ల పక్కన పంటపొలాలు దెబ్బతిన్నా పరిహారానికి కూడా దిక్కులేదని మోతె రైతులు వాపోతున్నారు.

దత్తత తీసుకున్న గ్రామాన్నే విస్మరించిన కేసీఆర్‌.. కామారెడ్డి నియోజకవర్గంలో గెలిస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆయన మాయమాటలు నమ్మి నిజామాబాద్‌ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు మోసపోవద్దని గట్టిగా చెబుతున్నారు. లేదంటే తమలాంటి పరిస్థితే వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీకి తగిన విధంగా బుద్ధిచెబుతామంటున్నారు మోతె ప్రజలు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Parameswar Reddy Uppal Congress MLA Candidate Exclusive Interview

Bigtv Digital

Israel : ఐక్యరాజ్యసమితిలో తీర్మానం.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటు!

Bigtv Digital

SEETHAKKA: సెక్రటేరియట్ లోకి సీతక్కకు నో ఎంట్రీ।

Bigtv Digital

World Cup 2023 rules: వరల్డ్ కప్ ఆటగాళ్లకు ఐసీసీ పెట్టిన మూడు నియమాలు

Bigtv Digital

Komatireddy Brothers : చేతిలో ముల్లు?.. కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోట్లు!

BigTv Desk

Ravindra Jadeja catch : రవీంద్ర జడేజాకు గోల్డ్ మెడల్ .. బెస్ట్ ఫీల్డర్ అవార్డు..

Bigtv Digital

Leave a Comment