Telangana RTC: హైదరాబాద్ మహా నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి అమలులోకి వస్తున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచారు. 4వ స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేస్తున్నారు. మరో రెండేళ్లలో హైదరాబాద్ మహా నగరంలో డిజిల్ బస్సుల స్థానంలో 2800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీ తీసుకురావాలనే యోచనలో టీజీఎస్ఆర్టీసీ ఉంది.
అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) జీహెచ్ఎంసీ పరిధిలో బస్సు ఛార్జీల పెంచిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సర్వీసుల టికెట్ ధరలు కూడా పెరుగుతాయేమో అని గ్రామీణ ప్రజానీకంలో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో కూడా పలువురు జిల్లా స్థాయి బస్సుల్లో కూడా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై TGSRTC అధికారులు క్లారిటీ ఇచ్చారు.
జిల్లా రూట్లలో ఛార్జీలను పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి కానీ.. ఆర్టీసీ సంస్థకు కానీ లేదని అధికారులు స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఏవీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు లేవని TGSRTC అధికారులు తెలిపారు తెలిపారు. ‘ట్రాఫిక్ టోల్, సెస్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని జిల్లా సర్వీసుల ఛార్జీలు గతంలోనే పెంచినట్టు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో ఛార్జీల పెంపునకు గల కారణాల గురించి అధికారులు వివరించారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఫ్లీట్‌ను విస్తరించడం, నగర రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల పైన భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్వల్ప ఛార్జీల పెంపు జరిగిందని.. లేకపోతే ఈ ఆర్థిక భారం పన్ను చెల్లింపుదారుల పై పడేదని అధికారులు తెలిపారు.
ALSOP READ: Sub Inspector: డిగ్రీ అర్హతతో 2861 ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. అక్షరాల రూ.1,12,400 జీతం
జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇప్పటికే కొనసాగుతోందని.. దీనికి ప్రస్తుతానికి ఛార్జీల పెంపు ద్వారా అదనపు నిధులు అవసరం లేదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అందుకే.. ఇప్పట్లో జిల్లా రూట్ బస్సుల్లో ఛార్జీలు పెంపు ఉండదని పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ నగరంలో కొత్తగా సవరించిన ఛార్జీలు రాబోయే రెండు నుంచి మూడేళ్ల వరకు మళ్లీ సవరించే అవకాశం లేదని టీజీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. మూడేళ్ల వరకు ఇవే ఛార్జీలు కొనసాగే అవకాశం ఉంటుందని వివరించారు.