Telangana Digital Connectivity: గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో.. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘టీ-ఫైబర్’ (T-Fiber) ప్రాజెక్టు, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల డిజిటల్ విప్లవానికి మార్గదర్శిగా మారిందని.. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ప్రశంసించారు.
ఆయన అధ్యక్షతన బుధవారం దిల్లీలో నిర్వహించిన.. స్టేట్ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్స్ అండ్ ఐటీ సెక్రటరీస్ రౌండ్ టేబుల్ సదస్సులో.. వినూత్న విధానాలతో డిజిటల్ సమ్మిళత్వానికి తెలంగాణ బాటలు వేస్తుందంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా అభినందించారు. లాస్ట్-మైల్ ఫైబర్ కనెక్టివిటీ గ్రామీణ సమూహాలను ఎలా మార్చగలదో.. తెలంగాణ చేసి చూపించిందని కొనియాడారు. టీ-ఫైబర్ నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ పైలెట్ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజిటల్ సమానత్వం సమ్మిళిత వృద్ధికి పునాది. గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాం” అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం భావితరాల కోసం పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని ఆయన వివరించారు. “టీ-ఫైబర్ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలకు తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తున్నాం. దీని ద్వారా ప్రజలకు ఈ-గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, డిజిటల్ వ్యవస్థాపకత వంటి సేవలు మరింత సమర్థవంతంగా చేరుతున్నాయి అని చెప్పారు.
టీ-ఫైబర్ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా, భారత్ నెట్ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. భారత్ నెట్ అమలులో వేగం పెంచాలని, రైట్ ఆఫ్ వే (ROW) సవాళ్లను పరిష్కరించాలని, సైబర్ భద్రతా ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేయాలని” ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉంది అని శ్రీధర్ బాబు తెలిపారు.
Also Read: శ్రీవారి భక్తులకు అందుబాటులోకి.. టీటీడీ 2026 డైరీలు, క్యాలెండర్లు
ఈ సమావేశంలో టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ డిజిటల్ సమ్మిళత్వ మోడల్ భారతదేశంలో గ్రామీణ అభివృద్ధికి ఒక కొత్త దిశను చూపుతోందని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.