TG New Ration Cards: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ ఇచ్చేసింది రేవంత్ సర్కార్. మండల కేంద్రాల్లో కొత్త కార్డులను అందజేసేందుకు ఏర్పాటు చేస్తోంది. జులై 25 నుంచి వాటిని అధికారులు పంపిణీ చేయనున్నారు. ఎన్నిరోజులపాటు ఇస్తారనేది అసలు ప్రశ్న.
లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్‌రెడ్డి జూలై 14న నల్గొండ జిల్లాలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంచారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేసే దిశగా కార్యాచరణ మొదలైంది.
జూలై 25 నుంచి ఆగష్టు 10 వరకు రేషన్ కార్డులను నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో పంపిణీ చేయనున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఆదేశాలను సోమవారం జారీ చేశారు. రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు.
తాజాగా 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ స్థాయిలో జారీ చేయడం ఇదే తొలిసారని అంటున్నారు. పాత రేషన్ కార్డుల్లో పేర్లు తొలగించడం, కొత్త వారిని చేర్చడం వంటివి జరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 96.95 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 3 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు.
ALSO READ: హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా.. ఈ అర్హతలున్నవారికే ఛాన్స్
గతంలో దొడ్డు బియ్యం పంపిణీ ఉన్నప్పుడు పెద్దగా కార్డులపై మొగ్గు చూపలేదు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. అప్పటి నుంచి రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని అంటున్నారు గ్రామాల ప్రజలు.
రేషన్ కార్డుల పంపిణీలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు హాజరవుతున్నారు. జిల్లా మంత్రులు అన్ని మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు పాల్గొంటారు. ప్రతి మండలానికి నోడల్ అధికారి ఉండనున్నారు.
రేషన్ కార్డు పంపిణీని పక్కాగా అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్త కార్డు రాని వారు ఇబ్బందులు పడాల్సిన పని లేదన్నది తెలంగాణ ప్రభుత్వం మాట. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు కూడా.