Riyaz encounter: ఇటీవల నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన రౌడీషీటర్ షేక్ రియాజ్ కుటుంబ సభ్యులు తమను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను (HRC) ఆశ్రయించారు. రియాజ్ తల్లి, భార్య, పిల్లలు చేసిన ఈ ఫిర్యాదుతో.. రియాజ్ ఎన్‌కౌంటర్ కేసు మరింత తీవ్రతరం అయింది.
కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేశాడు..?
రియాజ్ కుటుంబ సభ్యులు పోలీసులపై పలు తీవ్ర ఆరోపణలు చేశారు. వారిని ఇంట్లోకి అనుమతించకుండా శారీరకంగా.. మానసికంగా హింసిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. తమపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగిస్తున్నారని వారు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వీటితో పాటు.. రియాజ్ దాడిలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ పై కూడా కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ తమ వద్ద 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని రియాజ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అందులో ఇప్పటికే 30 వేల రూపాయలు చెల్లించామని ఫిర్యాదులో పేర్కొన్నారుే. మిగతా డబ్బుల కోసం కానిస్టేబుల్ నిత్యం వేధించేవాడని.. గతంలో కూడా అనేక లావాదేవీలు జరిగినట్లు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు.
డీజీపీకి హెచ్ఆర్‌సీ కీలక ఆదేశాలు..
రియాజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ అంశంపై తక్షణమే చర్యలు చేపట్టింది. రియాజ్ ఎన్ కౌంటర్ విషయమై ఇప్పటికే కమిషన్ సుమోటో కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈ కొత్త ఫిర్యాదు నేపథ్యంలో.. కమిషన్ తెలంగాణ డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ ఫిర్యాదు మరియు ఎన్కౌంటర్ అంశంపై నవంబర్ 3వ తేదీ లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీని హెచ్‌ఆర్సీ ఆదేశించింది. రియాజ్ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయొద్దని పోలీసులను మానవ హక్కుల సంఘాన్ని హెచ్చరించింది. రియాజ్ కుటుంబ సభ్యులపై పోలీసులు ఎలాంటి బలవంతపు చర్యలు లేదా వేధింపులు చేయకూడదంటూ కూడా కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: PM Kisan 21st Installment: పీఎం కిసాన్ పై బిగ్ అప్డేట్.. 21వ విడత డబ్బులు పడేది అప్పుడే
నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన రౌడీషీటర్ రియాజ్ ఆ తర్వాత పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, రియాజ్ కుటుంబ సభ్యుల మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల పర్యవసానంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.