Cyclone Montha: ఏపీలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొంథా తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు ప్రారంభించింది. ఈ మేరకు వ్యవసాయ, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖలు సంయుక్త సమీక్ష సమావేశం నిర్వహించాయి. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మొంథా తుఫాన్ కారణంగా అకాల వర్షాలు సంభవించే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం కొనుగోళ్లపై తుఫాన్ ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యం. టార్పాలిన్‌లను వినియోగించి ధాన్యం చెడిపోకుండా రక్షించాలి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా రవాణా సదుపాయాలు కల్పించాలి. 30–45 రోజుల వరకు కొనుగోలు ప్రక్రియలో అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలి. అకాల వర్షాలు కారణంగా వరి కోతలు నిలిపివేస్తే రైతులకు ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తలు అవసరం.’’ అని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇప్పటి వరకు 4,428 కేంద్రాలు ప్రారంభం అయ్యాయని, మిగతా 3,814 కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజు వరకు 22,433 మంది రైతుల నుండి 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు ₹431.09 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరపాలని, ప్రతి కొనుగోలు కేంద్రంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆదేశించారు. అవినీతి ఏ రూపంలోనైనా ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారుల కేంద్రాలలో పరిశీలించాలన్నారు. ఏ కారణం చేతనైనా రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
రెండు మూడు రోజులు కోతలు చేయవద్దు: మంత్రి తుమ్మల
తుఫాన్ ప్రభావం తెలంగాణ జిల్లాలకు ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులను, అధికారులను అలెర్ట్ చేస్తున్నామన్న మంత్రి, రైతులు తొందరపడకుండా రెండు మూడు రోజులు కోతలు చేయవద్దని కోరారు. ‘‘పంట తడిసి పోయి ఇబ్బంది పడకండి. మార్కెట్ కి వచ్చిన ధాన్యం కాపాడండి. అధిక వర్షపాతం వల్ల పత్తి దిగుబడి తగ్గింది. వరి దిగుబడి కూడా కొంత తగ్గుతుంది అని చెప్తున్నారు. పత్తి తేమ 12 నుండి 17 కి పెంచాలని కేంద్రాన్ని కోరాము. మొక్కజొన్న ను కొనుగోలు చేయాలని..కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా. కేంద్రం సహాయం చేయకపోయినా రైతులకు కాపాడుకుంటాం. మార్కెట్ కు వచ్చిన ధన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.’’ అని మంత్రి తుమ్మల అన్నారు.