CM Revanth Reddy: తెలుగు సినీ ఇండస్ట్రీలో తలెత్తిన కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా సినీ కార్మికులు రేపు అభినందన సభ నిర్వహిస్తున్నారు. సీఎం జోక్యంతో ఇటీవల సినీ పరిశ్రమలో నెలకున్న సమస్యలు, కార్మికుల వేతన వివాదం, ఇతరేత్రా ఇష్యూస్ అన్నింటికి పరిష్కారం లభించింది. ఈ క్రమంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, దాని అనుబంధ యూనియన్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.
ఈ అభినందన సభ యూసుఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రేపు సాయంత్రం 4 గంటలకు జరగనున్నట్టు అధికారులరు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు కూడా హాజరు కానున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావును కూడా ఈ సందర్భంగా సినీ కార్మికులు అభినందనలు తెలపనున్నారు. సినీ కార్మికులు, ఉద్యోగులు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపేందుకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
సమస్యల పరిష్కారంలో సీఎం పాత్ర
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపుతో సహా వివిధ డిమాండ్లతో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా సినీ షూటింగ్‌లు నిలిచిపోయాయి. పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. నిర్మాతలు, కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చి, సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా కృషి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం ఫలితంగా.. కార్మికుల వేతనాలను పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. తక్కువ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి సంవత్సరం 15 శాతం, ఆ తర్వాతి రెండేళ్లలో 2.5 శాతం, 5 శాతం చొప్పున మొత్తం 22.5 శాతం వేతనం పెంచాలని నిర్ణయించారు. రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు రోజువారీ వేతనం పొందుతున్న కార్మికులకు మొదటి సంవత్సరం 7.5 శాతం, ఆ తర్వాతి రెండేళ్లలో 5 శాతం చొప్పున వేతనం పెంచాలని ఒప్పందం కుదిరింది. చిన్న సినిమాలకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
సినిమా పరిశ్రమకు సీఎం హామీ
సమస్యల పరిష్కారంతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని ఆయన పునరుద్ఘాటించారు. కార్మికుల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. సినీ కార్మికులకు ఆరోగ్య బీమా, సంక్షేమ పథకాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. నిర్మాతలు, కార్మికులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో ఒక కొత్త విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
రేపటి కార్యక్రమం కోసం యూసుఫ్‌గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం స్వయంగా పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు, నిర్వాహకులకు సూచనలిచ్చారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అభినందన సభకు 25వేల మంది..
ఈ అభినందన సభ ద్వారా సుమారు 25,000 మందికి పైగా ఉన్న సినీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. సినీ పరిశ్రమలో సామరస్యపూర్వకమైన పని వాతావరణం నెలకొల్పడానికి, పరిశ్రమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి చేసిన కృషికి ఇది నిదర్శనం.
ALSO READ: Fact Check: రోజుకు రూ.60 వేల ఆదాయం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఫేక్ వీడియో వైరల్