కేటీఆర్ నిజంగా పశ్చాత్తాపడుతున్నాడా? అవును ఆయన మాటలు వింటే అదే అనిపిస్తుంది. మొన్నటి వరకు ప్రజలు తమ మీద కోపంతో ఓడగొట్టలేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల వల్లే తాము ఓడిపోయామని చెప్పుకున్న ఆయన.. ఇప్పుడు మాట మార్చాడు. ఇది వరలో కూడా ఓసారి ఇలాగే అన్నాడు కూడా. తాము కొన్ని తప్పులు చేశామని, పాలనలో లోపాల కారణంగా ఓడిపోయాయని తాజాగా కేటీఆర్ అంగీకరిస్తున్నట్టుగా మాట్లాడటం రాజకీయంగా చర్చకు వస్తోంది. ఏ వేదికల మీదకెక్కినా కేటీఆర్ ఎప్పుడూ తాము పశ్చాత్తపడుతున్నట్టుగా చెప్పలేదు.
మళ్లీ మేమే వస్తాం.. ప్రజలకు అర్థమైపోయింది. వాళ్లు విసిగి వేసారి పోయారు… రెండేండ్లు ఓపిక పట్టండి.. అంటూ చెప్తూ రావడమే తప్ప.. బాహాటంగా తమ లోపాల గురించి చెప్పటం అరుదనే చెప్పాలి. అలాంటి కేటీఆర్ .. కేసీఆర్ వైఖరికి తన వైఖరికి భిన్నంగా ఇలా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు. బహుశా తాము లోపాలు తెలుసుకున్నామనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లడం మూలంగా సానుభూతిని పొందాలనే వ్యూహంలో భాగం కావొచ్చు.లేదా.. ఎప్పుడూ అహంకారంగానే మాట్లాడుతాడు అనే ఒక ముద్రను తొలగించుకునేందుకు కావొచ్చు. కానీ కేటీఆర్ ఇలా మాట్లాడటం వల్ల ఆ పార్టీకి నష్టమేమి జరగదు.. పైపెచ్చు కొంత లాభమే జరుగుతుందనే చర్చ గులాబీ శ్రేణుల్లో కనిపిస్తున్నది.
కేసీఆర్ ఉద్యమకాలంలో ఉన్నట్టుగా.. అధికారంలోకి వచ్చిన తరువాత లేడనే వాదన చాలా మందిలో ఉంది. ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, తను అనుకున్నదే చేయడం.. పాలనా పరమైన నిర్ణయాల్లో అందరి మద్దతు కూడగట్టుకోకపోవడం లాంటి చర్యలతో ఆయనది నియంత పాలన అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసే స్థితి ఆనాడు వచ్చింది. అయినా కేసీఆర్ డోంట్ కేర్ అన్నాడు. పదేళ్ల పాటు ఆయన చెప్పిందే వేదం.. చేసిందే పాలన..అన్నట్టుగా సాగింది.
ఇది జనానికి నచ్చలేదని, అందుకే ఓడగొట్టారనే వాదన నేపథ్యంలో కేటీఆర్ కొంచెం తన ట్రెండ్ మార్చాడని అంటున్నారు. కేసీఆర్ జమానా నడిచిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచో చెడో, నష్టమో, కష్టమో.. నడిచిపోయింది. కేటీఆర కూడా అదే దోవలో నడిస్తే… కష్టమేనని సీనియర్లు ఇచ్చే సలహాలు కావొచ్చు.. తన అనుభవంలోకి వచ్చిన సంఘటనలు కావొచ్చు.. కేటీఆర్‌లో ఈ మార్పు రావడానికి కారణమై ఉంటుందనే అభిప్రాయాలు గులాబీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
అయినా కేటీఆర్‌ను ఆ పార్టీలోని చాలా మంది నేతలు నమ్మడం లేదనే వాదన కూడా తెరపై బలంగా ఉంది. కొంత మంది లీడర్లు ఈ విషయాలను బాహాటంగానే మాట్లాడుతారు. కేటీఆర్ అప్పుడే అహంకారంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. అప్పుడే పశ్చాత్తాపడి జనం ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పినట్టుగా తోస్తుంది. ఆయన వైఖరి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది…అని చెబుతున్నారు.
నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు.. మిమ్మల్ని వదలా..! అంటూ బహిరంగ వేదికల మీదే అధికారులను బెదిరించడం.. పింక్ బుక్కులో మీ పేర్లను ఎక్కిస్తాం.. ఎక్కడికి పోయినా వదలం.. అనే దోరణి పార్టీకి మరింత నష్టం తెచ్చే చర్యగా కూడా సీనియర్లు అభిప్రాపడుతున్నారు.
పనిలో పని కేసీఆర్‌ను మబ్బు చాటు చంద్రుడిలా కూడా పోల్చాడు కేటీఆర్. ఆ మబ్బులు వీడిపోగాకే మళ్లీ చంద్రుడు ప్రకాశిస్తాడని, ఈ చంద్రుడు సీఎం అవుతాడనేది కేటీఆర్ ఉద్దేశం. పార్టీలో ఉద్యమకారులకు, నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని ఎన్నిసార్లు అధిష్టానం దృష్టికి తీసుకువచ్చినా.. దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదనేది పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ కమిటీలు లేవు. అనుబంధ సంఘాల కమిటీలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు పదవులకు దూరం.. ఇప్పుడు పార్టీ పదవులకు కూడా అంతే…అని సీనియర్లు వైరాగ్యంగా చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను వీడి రాకపోవడం.. కేటీఆర్ ఇలా గడియాకో మాటలు ఎన్ని చెప్పినా.. నమ్మకాన్ని మాత్రం పెంచడం లేదంటున్నారు కొందరు బాధిత గులాబీ సీనియర్ నేతలు. తాజాగా సోషల్ మీడియాలో తండ్రిని బాధపెట్టడం కరెక్టు కాదని పరోక్షంగా కవితనుద్దేశించి కేటీఆర్ అన్నట్టుగా ఓ వార్తను ట్రోల్ అవుతున్నది. ఇది కూడా కేటీఆర్‌కు బూమరాంగై కూర్చున్నది. దీనిపై కవిత వర్గం ట్రోలింగ్స్ మొదలు పెట్టింది. పార్టీలో లోపాలున్నాయని చెప్పినప్పుడు.. దాన్ని తప్పుగా భావించి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి డ్రగ్స్ తీసుకుని దొరికిన ఫైలట్ రోహిత్ రెడ్డి ని మాత్రం నోటీసులతోనే ఎందుకు సరిపెట్టారు? లిక్కర్ రాణి అని మీ పార్టీ నేతలతోనే తిట్టించి.. ఆ కేసులో క్లీన్ చిట్ రాగానే.. అది మా పెంపక మహిమే.. మేం ఏ తప్పు చేయం.. అని మాట మార్చిన వైనాన్నీ గుర్తు చేస్తున్నారు.
చేసిందంతా చేసి.. చెల్లెను బాధపెట్టి.. ఇప్పుడు నీతి సూక్తులు వల్లెవేస్తున్నాడంటూ కవిత ఫాలోవర్స్, జాగృతి నాయకులు కేటీఆర్ పై ఫైర్ అవుతున్నారు. కేటీఆర్ ఏం మాట్లాడినా, ఏం పోస్టు చేసినా అది తిరిగి తమకే తాకుతున్నదని, ఇబ్బంది పెడుతున్నదనే అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో ఉంది. కానీ ఎవరేం మాట్లాడలేరు. పెద్దసారు .. అధికారమంతా చిన్నసారుకిచ్చాడు..? పాల ముంచినా నీట ముంచినా నీదే భారం అన్నట్టుగా గుడ్డిగా కేటీఆర్‌ను ఫాలో కావడమే మేం చేయాల్సింది.. అనుకుంటున్నారు కొందరు. కేటీఆర్ వైఖరి నచ్చనివాళ్లు.