Medchal Blast: మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఏం జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? అనుకోకుండా ఘటన జరిగిందా? కావాలనే ఎవరైనా చేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలీదు. మేడ్చల్ పట్టణంలో జరిగిన గ్యాస్ సిలిండర్ ఘటన ఇందుకు ఉదాహరణ. సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ భవనం కూలిపోయింది. దీనిధాటిని మూడు షాపులు ధ్వంసమయ్యాయి.
పేలుడు ధాటికి ఎగిరి పడిన భవన శకలాలు తగిలి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి తీవ్ర గాయపడి మృతి చెందాడు. అయితే ఇంట్లో ఉన్న వృద్ధురాలు, షాపు నిర్వాహకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. మేడ్చల్ పట్టణంలో మార్కెట్ కూడలికి సమీపంలో జాతీయ రహదారి ఉంది. మార్కెట్ రోడ్డు పక్కన శ్రీరాములు గౌడ్‌కు చెందిన ఓ భవనం ఉంది.
పాతకాలం నాటి భవనం కావడంతో రోడ్డు వైపు రెండు పూల దుకాణం షాపులు, ఓ మొబైల్ షాపు ఉన్నాయి. వెనకాల నివాస గృహంలో శ్రీరాములు చెల్లి తిరుపతమ్మ నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి గ్యాస్ సిలిండర్ భారీ శబ్ధంతో పేలింది. ఆ శబ్ధానికి ఆ భవనంలోని మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి భవన శిథిలాలు చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎగిరిపడ్డాయి.
ALSO READ: బిర్యానీ కోసం వెళ్తే స్కూటీ డిక్కీలోని 5 లక్షలు దొబ్బేశారు
అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి భవన శకలాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. భవన శిథిలాల్లో తిరుపతమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెతోపాటు షాపులో పని చేసే ఓ వ్యక్తికి చేయి విరిగిపోయింది. కూలిపోయిన గోడ శకలాలు చేయి పడటంతో చేయి విరిగింది.
మొబైల్ షాపులో పని చేసే మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి కొన్ని విషయాలు వెల్లడించారు.
మార్కెట్ పురాతన బిల్డింగ్‌లో సిలిండర్ పేలిందన్నారు. ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఘటన దృశ్యాలు పక్కన షాపులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.