Pahalgam Terror Attack: కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత కేంద్రం ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేసింది. ఓ వైపు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి బలగాలు.. ఈ దాడి జరిపింది ఎవరు? ఎక్కడి వారు? ఎలా వచ్చారు? ఈ దాడి మాస్టర్ మైండ్ ఎవరు? ఇప్పుడెక్కడున్నారు? వారిని ఎలా మట్టుపెట్టాలి? అనే దానిపై నిఘా పెట్టారు.
పర్యాటకులపై జరిగిన దారుణ హత్యాకాండతో కేంద్ర నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ముష్కర ముఠాలు మరిన్ని కీలక ప్రాంతాలపై కన్నేసినట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని 14 ప్రదేశాలను హై-అలర్ట్ జోన్‌లుగా ప్రకటించింది కేంద్రం. ఇవి తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులోకి వస్తాయి. మెరుగైన భద్రతా చర్యలను చేపట్టేందుకు.. ఈరోజు సాయంత్రానికల్లా ప్రత్యేక ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్) బృందాలు ఈ ప్రాంతాలకు మోహరించబడతాయి.
రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ – హైదరాబాద్
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – హైదరాబాద్
తిరుమల, అలిపిరి – తిరుపతి
రైల్వే స్టేషన్ – విశాఖపట్నం
రామకృష్ణ బీచ్ – విశాఖపట్నం
రైల్వే స్టేషన్ – విజయవాడ
కూకట్‌పల్లి – హైదరాబాద్
నాంపల్లి – హైదరాబాద్
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ – హైదరాబాద్
ట్యాంక్ బండ్ – హైదరాబాద్
జగదాంబ జంక్షన్ – విశాఖపట్నం
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ – విజయవాడ
ఎం.జి. రోడ్ – విజయవాడ
ప్రతి ఒక్కరు అత్యవసరమైతే తప్ప.. ఈ ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని సూచించారు. ఈ ప్రదేశాలకు ప్రయాణించడం తప్పనిసరి అయితే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిస్తే.. వెంటనే స్థానిక చట్ట అమలు సంస్థకు నివేదించాలని కోరారు.
కాగా పహెల్‌గామ్‌లో మారణహోమం కొనసాగించిన నలుగురు ఉగ్రవాదులు.. కథువా ఏరియాలో ఉన్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. ఇది ట్రాప్ అయ్యే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.
ఉగ్రవాదుల ఆచూకి తెలిపిన వారికి భారీ క్యాష్ ప్రైజ్‌ను ఇప్పటికే అనౌన్స్ చేశారు పోలీసులు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదుల ఊహాజనిత ఫోటోలను రిలీజ్ చేసిన పోలీసులు.. వారి ఆచూకి తెలిపిన వారికి 20 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ఈ ప్రకటన చూసే ఓ మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.
పహెల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ పోలీసులు హైఅలర్ట్‌లో ఉన్నారు. కుల్గాం పోలీసులు ఖాజీగుండ్‌లోని.. అనుమానిత ఉగ్రవాద సహచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఇక్కడ మాత్రమే కాదు.. అనేక ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిషేధిత సంస్థలకు సంబంధించిన మెటిరీయల్ దొరికిందని.. వాటిని స్వాధీనం చేసుకొని వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు తెలిపారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు.. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు ఉగ్రదాడి తర్వాత పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు కేంద్రం చకచకా నిర్ణయాలు తీసుకుంటోంది. అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ కాల్స్ చేశారు. రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో 208 మంది పాక్ పౌరుల ఉన్న పోలీసులు గుర్తించారు. పాక్ పౌరులు 2 రోజుల్లో భారత్ ను విడిచిపోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: బయటపడ్డ పాక్ బాగోతం..! వాళ్లు ఏకం కావడం కోసమే మనపై యుద్ధం
సింధు నది జలాల ఒప్పందంపై కూడా వెనకడుగు వేసేది లేదని చెబుతోంది కేంద్రం. ఇప్పటికే ఈ విషయంపై పాక్ న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించగా.. మీరు ఏం చేసినా ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదన్నట్టుగా ఉంది కేంద్రం వ్యవహారం. ఇక కొందరు నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించగా.. ఇది పాక్‌ను దారికి తీసుకొచ్చేందుకు తీసుకున్న నిర్ణయమని.. దౌత్యపరమైన దృష్టిలో చూడాలని కేంద్రం తెలిపింది.