BJP Lead Palivela : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఆఖరి రోజు. క్లైమాక్స్ లో హైటెన్షన్ క్రియేట్ చేసింది పలివెల గ్రామం. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై దాడి చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. కాషాయ దళం ఎదురు తిరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు పార్టీల వాళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. ఈటల పీఆర్వోకు గాయాలయ్యాయి. కార్లు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెవికి గాయమైంది. పలువురు టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు దెబ్బలు తగిలాయి. పలివెల గ్రామం ఈటల రాజేందర్ అత్తగారి ఊరు కావడంతో అటెన్షన్ నెలకొంది. మరి, ఇంతటి ఘర్షణ జరిగిన పలివెలలో ఎవరికి మెజార్టీ ఓట్లు వచ్చాయి? పలివెల ఓటర్లు కారుకు జై కొట్టారా? బీజేపీకి ఓటేశారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.
పలివెలలో 2104 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1952 మంది ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాక.. పలివెలలో బీజేపీకి 400 ఓట్లకు పైగా మెుజార్టీ వచ్చింది. అంతే, ఈటల అత్తగారి ఊరిలో.. ఆ ఊరి అల్లుడి పార్టీకి ఆదరణ దక్కినట్టైంది.
ఓడిపోతామనే భయంతోనే తమపై దాడికి తెగబడ్డారని ఆ రోజే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆయన అన్నట్టుగానే పలివెలలో టీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ, మునుగోడును మాత్రం దక్కించుకుంది. మునుగోడులో ఓడి.. పలివెలలో గెలిచారు కమలనాథులు. అత్తగారి ఊరిలో తన బలాన్ని మరోసారి బలంగా చాటుకున్నారు ఈటల రాజేందర్.