Bhuvanagiri collector: గ్రామానికి వెళ్లిన అధికారుల పర్యటనలన్నీ ఒకేలా ఉండవు. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం దూది వెంకటాపురంలో పల్లె నిద్ర సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు పర్యటన మాత్రం గ్రామ ప్రజలకు ఆశలు నింపింది. ప్రజల సమస్యలు విని, అక్కడికక్కడే చర్యలు తీసుకోవడం ఆయన ప్రత్యేకతగా చెప్పవచ్చు.
గ్రామ సభలో కలెక్టర్.. ప్రజలతో ప్రత్యక్ష భేటీ
పల్లె నిద్రలో భాగంగా, గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు, ప్రతి ఒక్కరి విన్నపాన్ని శ్రద్ధగా విన్నారు. ప్రజలు చెప్పిన ప్రతి సమస్యపై స్పందిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకున్నారు.
బస్సు లేదు.. తక్షణమే ఫోన్ చేసి ఆదేశాలు
ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల చాలా మంది గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నామని విన్న కలెక్టర్, వెంటనే గుట్ట డిపో డీఎంకి ఫోన్ చేసి, ఆ మార్గంలో బస్సు నడిపించాలని ఆదేశించారు.
తుప్పు పట్టిన కరెంట్ పోల్.. వెంటనే కొత్తదిగా మార్పు
పీర్ల కొట్టం వద్ద తుప్పు పట్టిన ఇనుప కరెంట్ పోల్ వర్షంలో ప్రమాదానికి దారితీస్తోందని గ్రామస్థులు తెలిపిన వెంటనే, డిపార్ట్‌మెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు ఆ సమస్యను పరిశీలించి కొత్తగా సిమెంట్ పోల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్లు, కొత్త సబ్‌స్టేషన్..
గ్రామానికి ఇప్పటికీ మొత్తం 24 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. అలాగే గ్రామంలో విద్యుత్ సమస్యల నేపథ్యంలో కొత్త సబ్‌స్టేషన్ మంజూరైన విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అలాగే గ్రామంలో కోతులు, వీధి కుక్కలు అత్యధికంగా ఉండడంతో ప్రజలు గౌరవంగా జీవించలేకపోతున్నామని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో, త్వరలోనే కొత్త వాష్‌రూమ్‌లు నిర్మిస్తామని తెలిపారు. పశువుల వైద్యం కోసం గ్రామస్తులు మైళ్ళ దూరం వెళ్ళాల్సి వస్తోందని విన్న కలెక్టర్, కొత్త వెటర్నరీ సబ్ సెంటర్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చారు. గ్రామస్థులు కొంతమంది బ్యాంకు మేనేజర్లు రుణాల విషయంలో ఇబ్బంది పెడుతున్నారని చెప్పగా, దీనిపై విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
Also Read: Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?
ప్రభుత్వ పథకాలపై గ్రామస్థుల ఆనందం
200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఆరోగ్యశ్రీ, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి ఇటీవల 33 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని, ఇప్పటివరకు అందరికి సన్న బియ్యం పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు.
పల్లె నిద్ర ముగిసేసరికి..
ఈ పల్లె నిద్రలో పాలుపంచుకున్న కలెక్టర్ హనుమంత రావు, ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అధికారుల పర్యటన అంటే కేవలం హంగామా కాదు.. ఆ గ్రామ సమస్యలకు పరిష్కారం తీసుకురావడమేనని ఆయన చేతల్లో చూపించారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.