Big Stories

PM Modi to Telangana : త్వరలో తెలంగాణకు మోదీ.. పొలిటికల్ హీట్ తప్పదా?

PM Modi to Telangana : తెలంగాణ రాజకీయాలు వింటర్ లో హీట్ పుట్టిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికతో అగ్గి రాజుకోగా.. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల ట్రాప్ తో తారాస్థాయికి చేరింది. ఫాంహౌజ్ డీల్ వీడియోలను దేశంలోని అన్ని వ్యవస్థలకి, అందరు ప్రముఖులకు పంపడంతో.. జాతీయ స్థాయిలో రచ్చ మొదలైంది. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారంటూ.. బీజేపీపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అంటూ కమలనాథులు సైతం రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నెల 12న తెలంగాణకు రానుండటం ఆసక్తికరంగా మారింది.

పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు పీఎం మోదీ వస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్ లో రామగుండం వెళ్తారు. ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించాక.. బహిరంగ సభలో మాట్లాడుతారు. ఇదీ షెడ్యూల్.

ప్రధాని మోదీది పూర్తిగా అధికార పర్యటనే అయినా.. రాజకీయాలకూ ఛాన్స్ ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. మోదీ ఎప్పుడు హైదరాబాద్ కు వచ్చినా.. విమానాశ్రయంలోనే రాష్ట్ర పార్టీ
ప్రముఖులతో మాట్లాడుతుంటారు. ఆ సందర్భంగా కమలనాథుల మధ్య ఫాంహౌజ్ ఎపిసోడ్ గురించి చర్చ జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. ఆ అంశంపై మోదీ ఎలా రియాక్ట్ అవుతారో, నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఇటీవల ఏ బీజేపీ అగ్రనాయకులు నగరానికి వచ్చినా.. కేంద్రానికి వ్యతిరేకంగా, తెలంగాణకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ.. భారీ ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేస్తూ పొలిటికల్ గేమ్ ఆడుతోంది గులాబీ పార్టీ. ఈసారి కూడా ఆ ఫ్లెక్సీ వార్ కొనసాగే అవకాశాలు ఎక్కువే అంటున్నారు. ఎప్పటిలానే ఫ్లెక్సీలతోనే సరిపెడతారా? లేదంటే ఆందోళనలు గట్రా చేస్తారా? అనే అనుమానమూ కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సీఎం కేసీఆర్ ఫుల్ సీరియస్ గా ఉండటంతో ఈనెల 12న తెలంగాణలో మోదీ పర్యటనకు గులాబీ సెగ తగిలేలా చేస్తారని చెబుతున్నారు. మరి, మోదీ సైతం రామగుండం బహిరంగ సభలో కేసీఆర్ సర్కారుపై ఏమైనా హాట్ కామెంట్స్ చేస్తారా? అధికారిక కార్యక్రమం కాబట్టి రాజకీయాల ప్రస్తావన లేకుండానే వెళ్లిపోతారా? తేలాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రధాని మోదీ తెలంగాణ టూర్ మరింత వేడి రాజేయడం మాత్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు. చూడాలి ఏం జరుగుతుందో…

ఇవి కూడా చదవండి

Latest News