JanaSena: జనసేన. కేవలం ఏపీ పార్టీయేనా అనే డౌట్. కాదు కాదు రెండు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ గా పని చేస్తామని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతుంటారు. చెప్పడమైతే చెబుతారు కానీ.. ఏపీలో మాత్రమే ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేస్తుంటారు. తెలంగాణలో తమకింకా సరైన టైమ్ రాలేదని అంటారు. ఆంధ్రప్రదేశ్ లో జోరుమీదున్న జనసేన.. ఇప్పుడు తెలంగాణపైనా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో కాస్త యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ సమావేశాలు, చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రమే చేపట్టిన తెలంగాణ జనసేన.. ఇప్పుడిక ప్రజా సమస్యలపై కదం తొక్కేందుకు కదనోత్సాహంతో కదులుతోంది. త్వరలోనే తెలంగాణలోనూ ఉనికి చాటుతామని ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్ సైతం క్లారిటీ ఇవ్వడంతో.. ఇక తగ్గేదేలే అంటున్నారు జనసైనికులు.
అన్నట్టుగానే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న తబ్లా రసా పబ్ ముట్టడికి జనసేన పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారి తీసింది. నివాస గృహాల మధ్య పబ్ ఉండకూడదని.. దాన్ని మరో చోటుకు షిఫ్ట్ చేయాలంటూ డిమాండ్ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. రాత్రి 10 దాటినా మ్యూజిక్ పెడుతున్నారంటూ జనసేన కార్యకర్తలు తబ్లా రసా పబ్ ముందు ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో జనసైనికులు తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించి వారి ముట్టడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పబ్ ముట్టడి పిలుపుతో జనసేన యాక్టివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిందని అంటున్నారు. జనసేనను ఏపీకే పరిమితం చేయకుండా.. పలు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు ముందడుగులు వేస్తున్నట్టుంది జనసేన. అయితే, కార్యకర్తలు ముట్టడించిన పబ్.. పవన్ కల్యాణ్ ఇంటికి సమీపంలోనే ఉండటంతో.. ఈ ఆందోళన ప్రజల కోసమా? పవన్ కోసమా? అనే అనుమానమూ వ్యక్తమవుతోందని అంటున్నారు.