భరోసాపై రైతాంగం జై..
రాష్ట్ర ప్రభుత్వానికి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్
కొండలు, గుట్టల మినహాయింపు భేష్
సాగు చేయని భూములకు ఎందుకు?
సాహసోపేత నిర్ణయమంటూ కామెంట్లు
సన్నాలకు బోనస్‌తో పెరిగిన సాయం
గ్రామాల నుంచి సర్కార్‌కు ఇన్‌పుట్స్
ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ఉందన్న అధికారులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : Rythu Bharosa Scheme: సాగులో ఉన్న భూములకే రైతుభరోసా సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం రాళ్లు రప్పలు, కొండలు, గుట్టలు, మైనింగ్ గనులు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫామ్ హౌజ్‌లు, రహదారులు, ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, నాలా కన్వర్షన్ కానివి… ఇలాంటివాటికి సైతం ఇస్తూ పోయింది. అయితే.. ఆ విధానానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫుల్‌స్టాప్ పెట్టారు. అటువంటి భూములకు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని రైతాంగం స్వాగతించింది.
పంట పెట్టుబడి సాయం కోసమే రైతుభరోసా పేరుతో ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటున్నప్పుడు పంట పెట్టని భూములకు ఆర్థిక సహాయం ఇవ్వడంలో అర్థం లేదనే అభిప్రాయాలూ రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ భూములను మినహాయించడం ద్వారా విపక్షాల నుంచి విమర్శలు వస్తాయని పసిగట్టినా.. వాటిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం గ్రామాల నుంచి సామాన్య ప్రజానీకం, రైతుల నుంచి ఫీడ్‌బ్యాక్ తెప్పించుకుంటున్నది. ఇప్పటివరకు వచ్చిన అభిప్రాయాలన్నీ ఆశాజనకంగా ఉన్నాయని, పాజిటివ్ స్పందనలే వచ్చాయన్నది సచివాలయ వర్గాల సమాచారం.
అప్పట్లోనే విమర్శలు
గత ప్రభుత్వం సైతం ఏదైనా కొత్త స్కీమ్ ప్రకటన చేసి, విధివిధానాలను ఖరారు చేసి, అమల్లోకి తెచ్చిన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నదో ఆరా తీసేది. గడచిన ఐదేండ్లలో రైతుబంధు పేరుతో రూ. 21 వేల కోట్లు సాగులో లేని భూములకు ఇవ్వడాన్ని రైతులు అప్పట్లోనే తప్పుపట్టారు.
యాభై ఎకరాలకు పైగా ఉన్న భూస్వాములకు కూడా రైతుబంధు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ప్రజా ప్రతినిధులు, బ్యూరోక్రాట్లకు కూడా ప్రతీ విడతలో లక్షలాది రూపాయలు ఈ స్కీమ్ కింద విడుదల కావడం విమర్శలకు కారణమైంది. పేద రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంటను పెట్టుకోడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నదని, దాన్ని ఆ అవసరాలకు కాకుండా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని కూడా గతంలోనే ఆరోపణలు వచ్చాయి. రైతుబంధు పేరుతో మొత్తం రూ. 85 వేల కోట్లలో దాదాపు రూ. 21 వేల కోట్లు వృథా అయిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ వేదికగానే స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రజాధనాన్ని సద్వినియోగమయ్యేలా నిర్ణయాలు ఉంటాయని ప్రకటించారు.
Also Read: Mahesh Kumar on Harish Rao: హరీష్ రావు.. వేరే పార్టీ చూసుకోండి.. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కామెంట్స్
బోనస్‌తో రైతుల్లో సంతృప్తి
రైతుభరోసా స్కీమ్ కంటే ముందే వడ్లకు (సన్న రకాలకు) క్వింటాల్‌కు రూ. 500 చొప్పున ప్రభుత్వం బోనస్ ఇవ్వడంపై పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఎకరానికి దాదాపు పది వేల చొప్పున బోనస్ అందిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ సాయం లేకపోవడాన్ని కూడా రైతులు ప్రస్తావించారు. రైతుభరోసా విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు నిరసనలకు ప్లాన్ చేయడంపై పెదవి విరిచారు. ప్రభుత్వం ఈ నెల చివరి నుంచి ఎకరానికి రూ. 12 (ఏటా) వేల చొప్పున రైతుభరోసా సాయాన్ని ఇవ్వడంపై స్పందిస్తూ… గతంలో రూ. 10 వేలు మాత్రమే వచ్చేదని, ఇప్పుడు రెండు వేలు పెరిగిందన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎలాగూ వడ్లకు బోనస్ తోడవుతున్నదనే అభిప్రాయాన్ని పంచుకున్నారు. రైతుల్ని రోడ్డెక్కించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు ఏ మేరకు సహకారం అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.