Hyderabad Karachi Bakery: మా బ్రాండ్ ఇది.. మాకు రక్షణ కల్పించండి సీఎం సార్.. మేము ఇండియన్స్ అంటూ వారు తమ సమస్యను ఏకరువు పెట్టారు. ఇంతకు వారెవరో కాదు.. హైదరాబాద్ కరాచీ బేకరీకి చెందిన యాజమాన్యం. వారు ఏమి చెప్పారు? అసలు వివాదం ఏమిటి? ఏంటా విషయం తెలుసుకుందాం.
వివాదం ఇదే..
హైదరాబాద్‌లోని ప్రముఖ కరాచీ బేకరీ పైన వివాదం చెలరేగుతోంది. నగరంలో గత కొన్ని రోజులుగా ఈ బేకరీ పేరుపై కొందరు తీవ్ర నిరసనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా, కరాచీ బేకరీ యాజమాన్యం స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది. అసలు వివాదం ఏమిటంటే.. ఇటీవల కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత మన దేశం పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని అల్టిమేటమ్ జారీ చేసింది. దీనితో దేశంలో ఎక్కడెక్కడో ఉన్న పాకిస్తానీలు తమ దేశం బాట పట్టారు.
అంతవరకు ఓకే గానీ, ఆ తర్వాత పాకిస్తాన్ ఆనవాళ్లు ఎక్కడ ఉన్నా మనవాళ్లు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మన దేశం సైతం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలకు కాస్త బాంబుల రుచి చూపించింది. ఆ కాస్త రుచికే పాకిస్తాన్ కకావికలమైంది. కాగా పాకిస్తాన్ పేరు విన్నా, అక్కడి వారి పేరు విన్నా మనకు కాస్త కోపం కామన్. అదే ఇప్పుడు హైదరాబాద్ కరాచీ బేకరీకి తిప్పలు తెచ్చిపెట్టింది.
నిరసనలు.. హెచ్చరికలు
కరాచీ బేకరీకి గల పేరును మార్చాలన్న డిమాండ్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. అటు వైజాగ్ లో కొందరు నిరసన తెలిపితే, మరికొందరు హైదరాబాద్ లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నిరసన తెలిపారు. ఈ అంశం రోజురోజుకు వివాదంగా మారుతుండగా, ఇప్పుడు యాజమాన్యం స్పందించింది.
యాజమాన్యం మాట ఇదే..
ఈ నిరసనలపై బేకరీ యాజమాన్యం మాట్లాడుతూ.. కరాచీ బేకరీని 1953లో స్థాపించామన్నారు. తమ తాత విభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చారని తెలిపారు. ఈ బేకరీ పేరు కరాచీ పెట్టడం వెనుక నాటి తమ పరిస్థితి అన్నారు. ఈ బ్రాండ్ నేటిది కాదని, 73 సంవత్సరాల కిందట ప్రారంభమైపోయిందన్నారు. ఈ వివాదం హైదరాబాద్‌లో పెరిగిన పాకిస్తానీ వలసదారుల గురించి పలు చర్చలకు దారితీసింది. కాగా, నగరంలో కొన్ని సామాజిక వర్గాలు, రాజకీయ నాయకులు పేరు మార్పు కోసం క్రమంగా నిలబడినప్పటికీ, బేకరీ యజమాని మాత్రం తమ బ్రాండ్‌ను ఒక భారతీయ చిహ్నంగా పేర్కొంటూ, పేరులో మార్పు చేయడం అనవసరం అని వారు పేర్కొన్నారు.
మా బ్రాండ్ ఇండియన్ బ్రాండ్..
తమ కరాచీ బ్రాండ్ పాకిస్తానీ బ్రాండ్ కాదు. ఇది పూర్తిగా ఇండియన్ బ్రాండ్ అంటూ యాజమాన్యం చెప్పుకొచ్చింది. తమ బేకరీల వద్ద ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఉంచుతున్నారని, అందుకు తాము గర్విస్తున్నామన్నారు. తాము భారతీయులమేనని, కానీ నాటి పరిస్థితులకు అనుగుణంగా తమ తాత చేసిన నామకరణం ఇదన్నారు. తాము భారతీయులమేనన్న విషయాన్ని గుర్తించాలని, పాకిస్తాన్ కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
సీఎం సార్.. ఆదుకోండి
తమ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కరాచీ బేకరీ యాజమాన్యం కోరింది. అలాగే రాష్ట్ర డిజిపి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు భద్రత కల్పించాలని కోరారు. కరాచీ బేకరీ పేరులో ఎలాంటి మార్పులు చేపట్టవద్దని ప్రస్తుత యాజమాన్యం కోరింది.
సోషల్ మీడియాలో వివాదం..
కరాచీ బేకరీ పేరును మార్చాలని సోషల్ మీడియాలో పలువురు తెగ వైరల్ చేస్తున్నారు. అలాగే కొందరు వార్నింగ్ లు కూడా ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కరాచీ బేకరీ యాజమాన్యం అధికారికంగా వివరణ ఇచ్చినప్పటికీ, ఈ వివాదంకు ఇక ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.