Raghuveera Reddy: కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల విధ్వంసంపై కాంగ్రెస్ కార్యవర్గ (CWC) సమావేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిందని సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరా రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం
దేశంలో దాదాపు 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారని, ఇది క్షమించరాని నేరమని రఘువీరా రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే పేదలు, బలహీన వర్గాలకు చెందిన 44 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే అనుమానంతోనే ఈ రకమైన చర్యలకు ఒడిగడుతున్నారని, 2025 జూన్ తర్వాత చేపట్టిన SIR ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవిఎంలు రద్దు చేయాలి
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో ఈసీ వైఖరిపై బృహత్తర ప్రజా ఆందోళనలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంల విధానాన్ని పూర్తిగా స్వస్తి పలికి, పాత పద్ధతిలో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులకు బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు సీజేఐని తొలగించి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించడాన్ని తప్పుపట్టారు.
రాహుల్ గాంధీ పోరాటానికి అభినందనలు
ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న లోపాలపై చాలాకాలంగా పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సిడబ్ల్యూసి అభినందించిందని తెలిపారు. తొలత ఆయన ఈ విషయాలు మాట్లాడినప్పుడు నవ్వినవారు కూడా ఇప్పుడు ఆయన మాటల్లోని నిజాయితీని గ్రహిస్తున్నారన్నారు. మోదీ, అమిత్ షాలు దొంగ ఓట్లతోనే అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
కరువు సహాయంపై ప్రధానికి లేఖ
మరొకవైపు దేశంలో కరువుతో రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా అల్లాడుతున్నారని రఘువీరా ఆవేదన వ్యక్తం చేశారు. కరువు పీడిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన ఆర్థిక సహాయం, సహకారం అందించాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: అదుపుతప్పి మాట్లాడితే మహిళలతో కొట్టిస్తాం: కొండా సురేఖ