AP-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మధ్య విస్తరించింది. దాని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే కొన్ని పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది. వర్షం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లరాదని సూచించింది వాతావరణ కేంద్రం. మరోవైపు తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏపీ, తెలంగాణల్లో జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు అయ్యింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన మేరకు రాష్ట్రానికి మరోసారి వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.
ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ మాట. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.6 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది.
ALSO READ: తెలంగాణలో భారీ పెట్టుబడులు.. ఎల్ఈడీ తయారీ యూనిట్
ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, వాగులు పొంగి ప్రవహించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో వాగు దాటుతున్న ఇద్దరు మహిళలు వరద ఉధృతికి కొట్టుకుపోయారు. మృతులు ఏలూరు జిల్లాకు చెందిన వరలక్ష్మి, చెన్నమ్మగా గుర్తించారు.
భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణ నీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల గేట్లు తెరిచారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్‌కు 2.74 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి 2.76 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.విద్యుదుత్పత్తి, కాలువల ద్వారా 2.82 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇక జూరాలకు 1.57 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 1.63 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.