Raj Gopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్వేగాలు, విమర్శలు, శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ సారి విమర్శలు బయట నుండి కాకుండా… అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచే రావడం గమనార్హం. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి.
రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడినప్పుడు చేసిన వ్యాఖ్యలు చుట్టూ ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. “సీఎం రేవంత్‌రెడ్డే ఇంకా మూడున్నరేళ్లు సీఎం గానే ఉంటారు, ఆయనను మార్చే ప్రసక్తే లేదు” అని ఆయన స్పష్టం చేసినప్పటికీ… అదే సమయంలో “ఆయన తన తీరు, తన మాటలు మార్చుకోవాలి. ముఖ్యమంత్రి అయినవాడు పాత విషయాలు తవ్వకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి” అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. రేవంత్ ఇప్పుడు ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. “నాయకుడిగా ప్రజల కోసం చేస్తున్న పని చెప్పాలి కానీ… విమర్శలు మాత్రమే చేయడం సరైనది కాదు” అని నిప్పులు చెరిగారు.
ఇక్కడితో ఆగలేదు రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. “తెలంగాణను సీమాంధ్ర కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కమిషన్ల పేరుతో కాలయాపన జరుగుతోంది. ఎవరికెవరికీ లబ్ధి చేకూరిందో బయటకు తీసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.
ఇక బీఆర్ఎస్ పార్టీపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. “అధికారాన్ని కోల్పోయిన ఫ్రస్టేషన్‌తో బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు కూడా అర్హత కోల్పోయారు. మౌనంగా ఉండే వారు ప్రతిపక్ష నేతలుగా ఉండే అర్హత లేదు. ప్రజల కోసం పోరాడే నాయకుడే ఆ హోదాలో ఉండాలి” అని ఫైర్ అయ్యారు.
ఇక మంత్రి పదవి విషయానికొస్తే, ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. “నాకు అధిష్ఠానం మంత్రి పదవిని హామీ ఇచ్చింది. కానీ అదే విషయాన్ని నా అన్న వెంకట్‌రెడ్డికి తెలియదు. అన్నదమ్ముల మధ్య కూడా కొన్ని విషయాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేమంతా కలిసి పనిచేశాం. ఒక్కరే అన్నీ చేశారనడం సరికాదు” అని చెప్పడం ద్వారా పార్టీ అంతర్గత విషయాలపై కూడా ఓ సంకేతం ఇచ్చారు. పైగా, “నాకు మంత్రి పదవి కోరిక ఉంటే బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చేవాడు. కానీ నేను కాంగ్రెస్‌లో ఉండటానికి కారణం పదవులు కావడం కాదు. ప్రజాసేవే లక్ష్యం” అని ఆయన స్పష్టత ఇచ్చారు. ఈ వ్యాఖ్యలన్నింటి వెనక రాజగోపాల్ రెడ్డికి అసంతృప్తి ఉందా? లేక మరో రాజకీయ ఎత్తుగడకోసం ఈ వ్యాఖ్యలు చేశారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.