Love marriage ban: ఆ ఊరిలో ఇక ప్రేమ పెళ్లి అనే మాట వినిపిస్తే అంతేనట. తల్లిదండ్రుల అనుమతి లేకుండా జరిగే వివాహాలను ఒప్పుకోమని గ్రామ పెద్దలు తేల్చేశారు. దీనితో ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఆ ఊరే వైరల్ గా మారింది.
పంజాబ్ రాష్ట్రంలోని రూప్‌నగర్ జిల్లాలో ఉన్న మానక్‌పూర్ షరీఫ్ అనే గ్రామంలో ఇటీవల వెలువడిన ఒక తీర్మానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామపంచాయితీ స్వయంగా సమావేశమై, కుటుంబ అనుమతి లేకుండా ప్రేమ వివాహాలు చేసుకునే జంటలను గ్రామంలో సహించబోమని తీర్మానించింది. తల్లిదండ్రులు, పెద్దల ఆమోదం లేకుండా జరిగే పెళ్లిళ్లు ‘సమాజానికి మచ్చ’గా భావిస్తున్నట్లు ఆ తీర్మానంలో స్పష్టం చేశారు. ఇది సాధారణ నిర్ణయం కాదని, ఈ వ్యవహారం ప్రజాస్వామ్య విలువలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నట్లు అనిపిస్తోంది.
గ్రామ తీర్మానం వల్ల ఏం మారుతుంది?
గ్రామస్థులందరి సమక్షంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ప్రేమ వివాహాలు చేసుకున్న వారు తమ కుటుంబ సభ్యుల అనుమతి లేకపోతే, వారిని గ్రామంలో నివసించనివ్వరట. అంతేగాక, ప్రేమగా సంబంధాలు పెంచుకుంటున్న యువతను గ్రామ పెద్దలు పిలిపించుకొని ప్రశ్నించడం, అపహాస్యం చేయడం వంటి చర్యలకు కూడా తలపడే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒక విధంగా ‘ఖాప్ పంచాయితీల’ మాదిరిగా వ్యవహరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇది ఏ న్యాయ బద్ధత?
భారతదేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి వ్యక్తిగత స్వేచ్ఛను, అభిప్రాయ స్వాతంత్ర్యాన్ని హామీ ఇస్తుంది. అందులో భాగంగానే, వ్యక్తికి తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు కూడా కలదు. సుప్రీంకోర్టు ఇప్పటికే అనేక సందర్భాలలో two consenting adults అనే మాటను స్పష్టం చేస్తూ ప్రేమ వివాహాలపై పోలీసు కేసులు పెట్టడాన్ని తప్పుబట్టింది. అలాంటి దేశంలో, ఒక గ్రామం ఏ ఆధారంతో ఇటువంటి నిర్ణయం తీసుకోవచ్చునని న్యాయవేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈ తీర్మానం వెనుక ఉన్న భావన
ఇలాంటి తీర్మానాల వెనుక చాలా సార్లు ‘సాంప్రదాయ పరిరక్షణ’ అనే నినాదం దాగి ఉంటుంది. పెద్దల నిర్ణయమే ఫైనల్, పిల్లలు తమ ఆలోచనలను బయటపెట్టే హక్కు కలిగి ఉండకూడదన్న ధోరణి చాలాచోట్ల కనిపిస్తోంది. కానీ సమాజం మారుతుంది. ఆధునిక కాలంలో యువత చదువుతోంది, ఉద్యోగాలు చేసుకుంటోంది. తాము ప్రేమించిన వారితో జీవితం గడపాలనుకోవడంలో తప్పేంటి? అనేది ఈ తరం ప్రశ్న.
దీనిపై యూత్ స్పందన
ఈ తీర్మానం వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో పంజాబ్ యువత, ప్రజాస్వామ్యవాదులు గట్టిగా స్పందించారు. ప్రేమించడమే నేరమా? అని హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఇది 2025.. మిగతా ప్రపంచం ఎలాన్ మస్క్‌తో మార్స్‌కు వెళ్లాలనుకుంటుంటే, మన పల్లెల్లో మాత్రం ఇద్దరు ప్రేమించుకోవడమే నేరంగా చూస్తున్నారు! అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: AP railway development: ఏపీలో చిన్న రైల్వే స్టేషన్.. ఇప్పుడు మరింత పెద్దగా.. స్పెషాలిటీ ఏమిటంటే?
పోలీసుల మౌనంపై ప్రశ్నలు
ఈ తీర్మానం చట్ట విరుద్ధమైనదిగా కనిపించినా, ఇంకా పోలీసు శాఖ ఈ విషయంపై క్లియర్‌గా స్పందించలేదు. ఇది గ్రామస్థుల అంతర్గత విషయమంటూ దాదాపు మౌనం పాటిస్తోంది. ఇది మిగతా గ్రామాలకు ప్రమాదకర సంకేతమవుతుందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఒక గ్రామం తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇతర ప్రాంతాలలోనూ ప్రేరణగా మారి, వ్యక్తిగత హక్కులను హరించగలదన్న భయం ఉంది.
ఎటు పోతుంది మన సమాజం?
ప్రేమను శిక్షించే సమాజం ఎప్పుడూ ముందుకు పోదు. యువతకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాల్సిన సమాజం, వారికి ఒత్తిళ్లు తెచ్చేలా వ్యవహరిస్తే, అది అభివృద్ధికి అడ్డంకి మాత్రమే అవుతుంది. ఒకరికొకరు ఇష్టపడటం అనేది సహజమైన భావోద్వేగం. దాన్ని అడ్డుకోవడం ద్వారా మనం మనవత్వాన్ని మరిచిపోతున్నాం. కుటుంబాల ప్రమేయం ఉండాలనుకోవడంలో తప్పేమీ లేదు, కానీ అది శాసనంగా మారినప్పుడు.. స్వేచ్ఛా హరణమే అవుతుందని కొందరి అభిప్రాయం.
పంజాబ్‌లోని మానక్‌పూర్ షరీఫ్ తీసుకున్న ఈ నిర్ణయం పై మిగతా సమాజం, న్యాయ వ్యవస్థ, మహిళా సంఘాలు మరియు మానవ హక్కుల సంఘాలు గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రేమ వివాహాలపై నిషేధం విధించడం కాదు… ప్రేమలో ఉన్న వారికి అండగా ఉండటమే సమాజం తీసుకోవాల్సిన సరైన దిశ అనేస్తున్నారు కొందరు ప్రేమికులు.