T BJP New President: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం అభిప్రాయ సేకరణలో పడిందా..? మత మీటరు లేనిదే కిలో మీటర్ కూడా నడవలేని కాంట్రవర్సీ నేతలకు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని బీజేపీ బాస్‌లు భావిస్తున్నారా? ప్రతి అంశాన్ని మతంతో ముడి పెట్టి స్పీచ్ లిచ్చే నేతలే అధ్యక్ష పదవికి న్యాయం చేయగలుగుతారని ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారా..? అందులో భాగంగానే ఎమ్మెల్యేలు రాజా సింగ్, పైడి రాకేష్‌రెడ్డిల పేర్లు పరిశీలిస్తున్నారా?
శాసన సభ సమావేశాలు వాడి వేడిగా ముగిసాయి.. ఒకవైపు ప్రజాపాలనతో ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతుంది. రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా పక్క ప్రణాళికలతో పాచికలు కదుపుతోంది. మరోవైపు అందుకు భిన్నంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల వ్యవహారం కనిపిస్తోంది. ఒకరు తానా అంటే మరొకరు తందాన అన్నట్టుగా అసెంబ్లీ సమావేశాల్లో ఆ రెండు పార్టీలు చేసిన వ్యవహారాన్ని టీవీ సిరియల్‌ల్లా చూస్తూ ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి. తెలంగాణ పార్టీ అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి మల్లగుల్లాలు పడుతుంది బీజేపీ అధిష్టానం. సమర్ధుడైన నేత కోసం ఢిల్లీ పెద్దలు అన్వేషిస్తుంటే.. ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదన్నట్లు వ్యవహరిస్తూ.. బీఆర్ఎస్ తోకలని ముద్ర వేయించుకుంటున్నారు.
ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంపిక అంశం రోజుకొక మలుపు తిరుగుతోంది. నిన్నటి దాక బీసీకి ఇస్తారా..? రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా.? ఏ సామాజిక వర్గానికి ఇస్తారు అనేది సస్పెన్స్ గా ఉండేది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న లెక్కల ప్రకారం చూస్తుంటే .. అధిష్టానం లైన్ దాటకుండా మత ప్రాతిపదికన ఉన్న నేతలనే అధ్యక్ష పదవి కోసం ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఉన్న 8 మంది ఎమ్మెల్యేలలో అధ్యక్ష ఎంపికపై కేవలం కొంత మంది ఎమ్మెల్యేల అభిప్రాయం మాత్రమే తీసుకున్నారంట. అందులో ప్రధానంగా పైడి రాకేష్ రెడ్డి, రాజసింగ్‌లకు మాత్రమే అధిష్టానం అధ్యక్ష పదవి ఆఫర్ ఇచ్చిందంట. కీలకమైన పార్టీ అధ్యక్ష పదవిపై మిగతా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోకపోడం పార్టీలో హాట్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: పాత బస్తీకి మెట్రో లైన్ క్లియర్.. ఇక్కడ గజానికి ఎంత రేట్ ఇస్తున్నారంటే..
అధిష్టానం కేవలం పైడీ రాకేష్ రెడ్డి, రాజాసింగ్ ల అభిప్రాయాలు మాత్రమే వారికి పదవి ప్రతిపాదన పెట్టిన సందర్భంగా పార్టీ పెద్దలకి, వారికి మధ్య చర్చ జరిగిందంటున్నారు. పైడి రాకేష్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవి అధిష్టానం ఆఫర్ చేస్తే.. ఆయన నిరాకరించారంట. అధ్యక్ష పదవి ఇస్తానంటే కేవలం మూడు జిల్లాలకే ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని అడిగారంట. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధ్యక్షులు ఎవరో తేలిపోయిందని, సంక్రాంతి తరువాత కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని .. రాష్ట్రంలో పార్టీ చాలా బలహీనంగా ఉందని.. పార్టీ బలోపేతం కావల్సిన అవసరం ఉందని.. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ మూడు జిల్లాలకు ఇన్చార్జ్‌గా ఇవ్వమని అధిష్టానాన్ని అడిగానని పైడి రాకేష్‌రెడ్డి అంటున్నారంట.
అధిష్టానానికి పైడి రాకేష్‌రెడ్డి చేసిన ప్రతిపాదన తెలియడంతో పార్టీ వర్గాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. అంతేకాదు అధ్యక్ష పీఠం ఎక్కేవారు మత మీటర్ లేకుండా కిలో మీటర్ కూడా నడవలేని నేతల కోసమే అధిష్టానం వేతుకుందా? అనే డైలమాలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. అయితే మరోవైపు పైడి రాకేష్ రెడ్డి ఏంటి, అధిష్టానం ఆయనకు అధ్యక్ష పదవి ఆఫర్ చేయడమేంటి?..ఆయన వద్దనడమెంటి? ఎవరి పాటికి వారు అధ్యక్ష పదవి, పార్టీ బలహీనతల గురించి ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుందటంపై రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉందంట. ఏదేమనా నిజంగా అధిష్టానం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకే ప్రెసిడెంట్ పోస్టు ఆఫర్ ఇచ్చి ఉంటే.. రాకేష్‌రెడ్డి వద్దనడంతో.. రాజాసింగ్ కొత్త అధ్యక్షుడవుతారా? అన్నది పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తం ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు అటూ అసెంబ్లీలో, ఇటూ మీడియా ముందు ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడుతున్నారో తెలియక … ఇటు సొంత పార్టీతో పాటు, అటూ అధికార, విపక్ష పార్టీల్లో నవ్వుల పాలు అవుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. మరి తెలంగాణలో అధికారంపై బోల్డు ఆశలు పెట్టుకున్న ఢిల్లీ కమలనాథులు ఇక్కడ నేతలను ఎప్పటికి? ఎలా? గాడిలో పెడతారో చూడాలి