Raja Singh: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పదవీకాలంలో జరిగినట్లు చెబుతున్న పలు అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. సజ్జనార్ పనితీరుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర సీబీఐ విచారణ లేదా జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని రాజాసింగ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
దర్యాప్తు జాప్యంపై ప్రశ్నలు
గతంలో సంచలనం సృష్టించిన గోల్డ్ థెఫ్ట్ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంతవరకు అరెస్టులు ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా, హామ్ వే కేసులోనూ దర్యాప్తు అత్యంత మందకొడిగా సాగుతోందని, ఈ ఆలస్యానికి గల అసలు కారణాలు ఏమిటో ప్రజలకు తెలియాలని అన్నారు. ఇటీవల జనార్ధన్ పై చేసిన ట్వీట్ తర్వాత సజ్జనార్ వ్యవహారశైలిపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆస్తులు, గత ఆరోపణలపై విచారణకు డిమాండ్
కేవలం కేసుల దర్యాప్తు మాత్రమే కాకుండా, సజ్జనార్ ఆస్తులపై వస్తున్న ఆరోపణలపైనా స్పష్టత రావాలని రాజాసింగ్ కోరారు. కర్ణాటకలో ఆయన సుమారు 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఇంత పెద్ద మొత్తంలో భూమి కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు, గతంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుని, వాటన్నింటిపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
Also Read: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. తెలంగాణకు రూ.30 వేల కోట్ల సాయంపై కీలక చర్చ!