Sonia Gandhi: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ తెలుగు వెర్షన్‌ను కేవలం మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ పుస్తకాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు కూడా అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌లో విదేశీ, భారతీయ ప్రతినిధులకు ఇప్పటికే ఈ పుస్తకాలను పంపిణీ చేశామని, సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తకం చాలా బాగుందని రాహుల్ గాంధీ స్వయంగా ప్రశంసించారని పేర్కొన్నారు. శనివారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇక గిగ్ వర్కర్స్ ర్యాలీలో తాను పరుగెత్తడంపై స్పందిస్తూ.. ర్యాలీ సమయంలో తన బైక్ స్కిడ్ కావడంతో కొంత వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని మహేష్ గౌడ్ వివరించారు. తాను పక్కన లేకపోవడాన్ని గమనించిన రాహుల్ గాంధీ వెంటనే పిలిచారని, తాను ఫిట్‌గా ఉండటం వల్లే వేగంగా పరుగెత్తుకుంటూ ఆయన వద్దకు చేరుకున్నానని చెప్పారు. అధినాయకుడు రాహుల్ గాంధీ పక్కన నడిచే, పరుగెత్తే అవకాశం రావడం తన అదృష్టమని, మహాభాగ్యమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also read: ఒక్క రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ, 4 ఓటీటీలు, రూ.4,000 విలువైన ప్రీమియం బెనిఫిట్స్ ఫ్రీ!
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరిగిందని పీసీసీ చీఫ్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో ఓబీసీల స్థితిగతులపై రాహుల్ ఆరా తీశారని, ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించారని చెప్పారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ పరిస్థితులపైనా రాహుల్ గాంధీతో చర్చ జరిగినట్లు వెల్లడించారు.
రాహుల్ గాంధీతో జరిగిన ఒక సరదా సంభాషణను మహేష్ గౌడ్ గుర్తుచేసుకున్నారు. “మీరు రోజూ కుర్తా పైజామా వేసుకుంటే చాలా బాగుంటుంది” అని తాను రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశానని, అందుకు ఆయన నవ్వుతూ తనకు ఒక చాక్లెట్ ఇచ్చారని తెలిపారు. సంపన్న కుటుంబంలో పుట్టినప్పటికీ రాహుల్ గాంధీ ఆలోచనలన్నీ ఎప్పుడూ సామాన్యుల కోసమే ఉంటాయని కొనియాడారు. భారత్ సమ్మిట్ సూపర్ సక్సెస్ కావడం, రాహుల్ రాకతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండిందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Also read: తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదు.. పెట్టుబడిదారులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!