Sushmita Funeral: ప్రేమ కాటుకు బలై ఆత్మహత్య చేసుకున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన మునిగె సుస్మిత (25) అంత్యక్రియల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వగ్రామమైన నడివాడలో సుస్మిత మృతదేహానికి జిల్లెడు చెట్టుతో వివాహం జరిపించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేద పండితుడి మంత్రోచ్చారణ మధ్య ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కలిచి వేసింది.
అయితే జిల్లెడు చెట్టుతో సుస్మిత వివాహం జరగడం వెనుక బలమైన కారణమే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ సంప్రదాయం ప్రకారం పెళ్లి కాని యువతులు మరణిస్తే.. వారికి నేరుగా అంత్యక్రియలు నిర్వహించమని పేర్కొన్నారు. ఒకవేళ కన్యగా ఉన్న యువతిని పూడ్చిన పక్షంలో మృతదేహాన్ని తవ్వి తీసి చెడు కార్యాలకు వినియోగించుకునే అవకాశముందన్నారు. అది జరగకుండా జిల్లెడు చెట్టుతో పెళ్లి జరిపించి.. ఒక వివాహితలా సుస్మితకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కన్నీరుమున్నీరు అయ్యారు.
కుమార స్వామి, సుకన్య దంపతులకు సుస్మిత పెద్ద కుమార్తె. ఎస్సై కావాలన్న లక్ష్యంతో ఆమె మహబూబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ పొందుతోంది. అయితే నడివాడ గ్రామానికే చెందిన అనిల్ ను ఆమె ప్రేమించిందని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు మోసం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనిల్ తో పాటు మరో 10 తన మరణానికి కారణమని చెబుతూ 18 పేజీల సూసైడ్ నోట్ రాసి సుస్మిత బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొంటున్నారు.
Also Read: పోస్టాఫీసు మైండ్ బ్లోయింగ్ స్కీమ్.. రూ.లక్ష పెడితే ఏకంగా రూ. 44,995 వడ్డీ.. ప్రభుత్వానిదే బాధ్యత!
ఇందులో భాగంగా సుస్మిత మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు రాస్తారోకో సైతం చేశారు. మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద ధర్నాకు దిగారు. 6 గంటల పాటు సాగిన ఆందోళనలతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చివరికి పోలీసులు కలుగజేసుకొని బాధిత కుటుంబానికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి.. సుస్మిత మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మృతదేహానికి తొలుత పెళ్లి చేసి.. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: స్పామ్ కాల్స్ లొల్లి.. జియో vs ఎయిర్టెల్ vs వీఐ.. ట్రాయ్ షాకింగ్ రిపోర్ట్!