Telangana Investments: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, రాష్ట్రంలో విధానపరమైన గందరగోళం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు పాలసీ పెరాలసిస్ లేదని, పెట్టుబడులకు అవసరమైన భూములు, నీళ్లు, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించామని చెప్పారు.
విద్య, వైద్యం, పరిశ్రమలే మా ప్రాధాన్యత
విద్య, వైద్యం, పరిశ్రమలు, సేవారంగాల్లో రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పాటు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంలో ఐఎస్బీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సీఎం అన్నారు. వైద్య రంగంలోనూ హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు పీహెచ్ఎఫ్ఐ వంటి సంస్థలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించుకున్నామని, మిగతా టిమ్స్ ఆస్పత్రులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తున్నామని, ఆస్పత్రుల అభివృద్ధి కోసం మొత్తం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.
వైద్య రంగానికి పెద్దపీట..
దేశంతో పాటు మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు కూడా పెట్టుబడుల కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నాయని చెప్పారు. గత నాయకులు తీసుకున్న దూరదృష్టితో కూడిన నిర్ణయాలే నేటి హైదరాబాద్ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో అక్షరాస్యత కేవలం 12 శాతం మాత్రమే ఉండేదని, ఆహార కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు పునాదులు వేశారని చెప్పారు. శ్రీశైలం, భాక్రా నంగల్ వంటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి నీటి వసతి పెరిగిందని, దేశం ఆహార కొరత నుంచి మిగులు ఆహార ధాన్యాల స్థాయికి చేరుకుందని వివరించారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక మార్పులు దేశంలో సమాచార సాంకేతిక రంగం అభివృద్ధికి బాటలు వేశాయని సీఎం అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ప్రపంచంలోని ప్రముఖ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రతి గ్రామానికి విద్య చేరినా, నాణ్యమైన విద్య అందించడంపై ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ పిల్లలు.. ప్రపంచంతో పోటీ పడాలి: సీఎం రేవంత్
తెలంగాణలోని మారుమూల గ్రామంలో ఉన్న విద్యార్థి కూడా న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పనిచేసే వారితో పోటీపడే స్థాయికి ఎదగాలని రాష్ట్ర సీఎం రేవంత్ ఆకాంక్షించారు. పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశ చూపాయని చెప్పారు. రాష్ట్రంలో గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మంచి విధానాలను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా విభేదాలు ఉండవచ్చని, కానీ అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను మాత్రం కొనసాగించాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు, విద్యాసంస్థల విషయంలో తమకు ఎలాంటి వివక్ష లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి వస్తోందని చెప్పారు. తెలంగాణను 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను రూపొందించామని సీఎం తెలిపారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’
హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు గొప్ప వరమని, దాని లోపల సుమారు కోటి 34 లక్షల మంది నివసిస్తున్నారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తూ ఈ ప్రాంతాన్ని సేవారంగానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, 160 కిలోమీటర్ల రహదారికి టెండర్లు పిలిచామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ సుమారు 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు అవతలి ప్రాంతాన్ని రేర్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని, పెట్టుబడులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
65 శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే..
రాష్ట్ర ఆదాయంలో సుమారు 65 శాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే వస్తోందని సీఎం తెలిపారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లాగా రంగారెడ్డి నిలిచిందని చెప్పారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, పారిశ్రామికవేత్తలు ఎలాంటి సందేహాలు లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చని సీఎం భరోసా ఇచ్చారు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాలు కూడా హైదరాబాద్‌లోని జీఎంఆర్ పరిధిలో తయారవుతున్నాయని చెప్పారు. 1960వ దశకంలో నెహ్రూ, ఇందిరాగాంధీ చొరవతో హైదరాబాద్‌లో ఐడీపీఎల్ ఏర్పాటు కావడం వల్లే రాష్ట్రంలో ఫార్మా రంగానికి పునాదులు పడ్డాయని గుర్తుచేశారు. పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హైదరాబాద్ ఫార్మా రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందన్నారు.
సీఎం రేవంత్ ఆందోళన..
దేశంలోని బల్క్ డ్రగ్స్ ఉత్పత్తిలో 40 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ఎలీ లిల్లీ హైదరాబాద్‌లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తోందని చెప్పారు. అనేక అంతర్జాతీయ సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని, పెట్టుబడిదారులకు అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. వైద్య రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం అన్నారు. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రతి ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. క్యాన్సర్‌ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించి, రాష్ట్రంలో రోగుల వివరాలను సేకరించామని చెప్పారు. తెలంగాణ డేటా రిచ్ స్టేట్ అని, ఆరోగ్యశ్రీ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వివరించారు. ఫ్లోరైడ్ సమస్యతో పాటు మూసీ కాలుష్యం నల్గొండ జిల్లా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
మూసీ ప్రక్షాళనపై స్పష్టత
ముఖ్యంగా పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే మూసీ శుద్ధి తప్పనిసరని స్పష్టం చేశారు. పీహెచ్ఎఫ్ఐ ప్రాజెక్టును 2028 జూన్ 2 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. ఈ సంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పీహెచ్ఎఫ్ఐ హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించడమే కాకుండా, తాను స్వయంగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
Also Read: భార్యాభర్తలమే కానీ వేరుగా ఉంటున్నాం.. రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్!