CM Revanth Reddy: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను సీఎం ఫోన్ లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్చకులు రంగరాజన్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణలో ప్రముఖ ఆలయమైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ఫౌండర్ రంగరాజన్ ఆయన తండ్రి సౌందర్య రాజన్ లపై శుక్రవారం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంట్లోకి రాత్రివేళ చొరబడిన దుండగులు.. ఆయనపై, వృద్ధులైన ఆయన తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించి.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సైతం బయటకు వచ్చింది. ఘటన పట్ల అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
హిందూ ధర్మం, ఆలయాల వ్యవస్థపై జరుగే దాడులను నిత్యం ప్రశ్నిస్తూ.. రంగరాజన్ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం మారేసి.. తరాలుగా వారి ఆధీనంలోని చిలుకూరు ఆలయంలో ప్రధానార్చకులుగా పూజాక్రతువులు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగరాజన్ సుపరిచితులు.. అలాంటి వ్యక్తిపై దాడి జరగడం సంచలనంగా మారింది. వివిధ వర్గాలు, సంఘాలు.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన రంగరాజన్ పై దాడి చేసి రెండు రోజులు అవుతున్న బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగరాజన్ సైతం ఈ విషయంపై పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తమపై దాడి జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని మాత్రమే వెల్లడించారు. అంతకు మించి తాను ఇంకేమి మాట్లాడను అంటూ ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా.. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు.
నిన్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి వచ్చిన కొందరు.. రామ రాజ్యం స్థాపనకు మద్ధతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో వారు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు అని పోలీసులు పేర్కొన్నారు. రంగరాజన్, సౌందర్య రాజన్ లపై దాడి విషయమై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాాయి. దాడికి పాల్పడిన వాళ్లు, అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నితమైన వ్యవహారం కావడం, హిందూ సంఘాలు, కార్యకర్తలు.. నిరసనలకు దిగే అవకాశం ఉండడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దాడులకు కారణమైన వాళ్లును పట్టుకునే పనిలో ఉన్నారు.
రంగరాజన్… నమస్తే సర్, నమస్తే అనగానే… ముఖ్యమంత్రి “నమస్తే అయ్యగారూ” అని పలకరించారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు చెప్పాల్సింది కదా అని ముఖ్యమంత్రి అడగగా… మీరు ఉన్నారు, పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తోందని రంగరాజన్ అన్నారు. పోలీసులు బాగా స్పందించారని కితాబునిచ్చారు.
Also Read: AP BC Gurukula Schools: గుడ్ న్యూస్.. ఏపీ బీసీ గురుకులాల్లో అయిదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలు..
ఇప్పటికే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూడీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించగా.. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను సీఎం ఫోన్ లో పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్చకులు రంగరాజన్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.