Ramchander Rao: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ రెండు పార్టీలు బీజేపీపై బురదజల్లుతున్నాయని మండిపడ్డారు.
తాగునీటి కొరత, భూకబ్జాలపై ఆగ్రహం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదని రాంచందర్ రావు విమర్శించారు. నగరంలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని, మరోవైపు పెద్ద ఎత్తున భూకబ్జాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 15 శాతం కమిషన్లు తీసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా 20 శాతం కమిషన్లు వసూలు చేస్తోందని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే బహిరంగంగా చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు వీరిని పూర్తిగా తిరస్కరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా జలాలపై సంతకం పెట్టింది మీరు కాదా?
బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాంచందర్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం చేస్తూ 299 టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చింది మీరు కాదా? అని కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ నీటి వనరుల అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా ఇందుకు సహకరిస్తున్నాయని తెలిపారు.
సరైన డీపీఆర్ పంపకుండా కేంద్రంపై నెపమా?
సమ్మక్క సారలమ్మ బ్యారేజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇవ్వకపోవడం వల్లే కేంద్రం దానిని వెనక్కి పంపించిందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మాని, సరైన డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపాలని హితవు పలికారు. పాలన చేతగాక బీజేపీపై విమర్శలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
Also Read: కర్ణాటకలో చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు యువతుల మృతి, నలుగురికి తీవ్ర గాయాలు