CM Revanth Reddy: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావారణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా జలాలు దక్కేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యామ్‌లు నిండిన తర్వాతే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనేలా ఉన్నందున అంతరాష్ట్ర జలాల్లో ప్రొరేటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా జలాలు వచ్చేలా ఆయా రాష్ట్రాల అధికారులతో ముందుగానే చర్చించి తగిన కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల వర్షాకాల సన్నద్ధతపై సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రలోని కోయనా డ్యామ్ నీటిని వంద శాతం జల విద్యుదత్పత్తికే మహారాష్ట్ర వినియోగిస్తోందని.. ఆ మొత్తం నీటిని మనం తీసుకొని వారికి అవసరమైన విద్యుత్ మనం సరఫరా చేసే దానిపై ఆ రాష్ట్ర అధికారులతో చర్చించాలని సీఎస్ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. గోదావరి నది నుంచి ఏటా వేల టీఎంసీల జలాలు సముద్రం పాలవుతున్నాయని.. అయితే ఆ వరదంతా చాలా స్వల్ప కాలంలోనే వస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి, అటు ప్రాణహితల వైపు నుంచి వచ్చే వరదను ఎలా మళ్లించాలనే దానిపై స్పష్టమైన విధానం రూపొందించాలని సీఎం సూచించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నిర్మించిన సీలేరు, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో తెలంగాణకు రావాల్సిన వాటాపై నివేదిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. డ్యామ్‌ల మెయింటెనెన్స్‌పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. గతంలో కడెం ప్రాజెక్టులో తలెత్తిన ఇబ్బందులను సీఎం గుర్తు చేశారు. గేట్ల మరమ్మతులు, మెయింటెనెన్స్‌లకు సంబంధించి ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఎన్ని నిధులు అవసరమైనా వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ఈ వర్షాకాలంలో ఎక్కడైనా డ్యామ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
వాతావరణ శాఖ అంచనాలు, నివేదికల ఆధారంగా పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంటల మార్పిడి, పంటల వైవిధ్యత, తక్కువ నీరు వినియోగించుకునే పంటలు, పంట రకాల సాగుపై రైతులకు రైతు వేదికల నుంచి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఈ విషయంలో ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించాలని సీఎం తెలిపారు. టీవీ ఛానెళ్లలోనూ ఇందుకు సంబంధించిన ప్రసారాలు అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పంటల సాగుతో పాటు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరాలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రామగుండం ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా అంతా తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గతేడాది వరదల సమయంలో కామారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో తాను క్షేత్ర స్థాయిలో పర్యటించిన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నాడు ఇచ్చిన హామీలు.. వాటి ప్రస్తుత పరిస్థితి.. ఏవైనా నెరవేరకుంటే అందుకు కారణాలతో తనకు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. హామీల అమలులో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విపత్తుల సమయంలో విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం సూచించారు. వడగాలులు, వరదల సమయంలో ప్రజలు ప్రాణాలు, ఆస్తులు కోల్పోయినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. వరదల సమయంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, కూలిన వంతెనల స్థానంలో నూతన వంతెనల నిర్మాణం, ఇతర పనులకు విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000 కోట్లను నిబంధనల ప్రకారం వ్యయం చేయాలని సీఎం సూచించారు.
క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వర్షాకాలంలో రోడ్లపై వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. నీరు నిలిచే 141 ప్రదేశాలను గుర్తించి వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మించాలని గతంలో నిర్ణయించామని, వాటి పురోగతిపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే 11 వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పూర్తి చేశామని, మిగతా వాటి పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాకాలంలో నగరంలో సమస్యల పరిష్కారానికి ముగ్గురు కమిషనర్లు, మూడు నగరాల పోలీస్ కమిషనర్లు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం సూచించారు.
Also Read: జియో రూ. 189 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్, వీఐలకు చుక్కలే.. ఏది బెస్ట్ అంటే?
వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతాలోనూ తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బందులు లేవని అధికారులు సీఎంకు తెలియజేశారు. పరిస్థితికి తగినట్లు తాగు నీరు, విద్యుదుత్పత్తి, సాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ వర్షాకాలానికి అవసరమైన సామగ్రిని ముందుగానే సమీకరించుకోవాలని సీఎం సూచించారు. గాలిదుమ్ములు, భారీ వర్షాలతో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్న్పపుడు, లైన్లు తెగిపోయి సరఫరా నిలిచినప్పుడు తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు నిర్ణీత సమయంలో భేటీ అవుతూ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో ముందుకు సాగితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.
Also Read: రేపే జనసేన సభ.. పవన్‌కు బీఆర్ఎస్ ఉచ్చు.. బాబు ఫార్ములా రిపీట్ కానుందా?