Praja Balam: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకు సంక్రాంతి పండుగ తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజా బలం’ పేరుతో భారీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ ఐదు నెలల పాటు పార్టీ నాయకులంతా నిత్యం గ్రామాల్లో పర్యటించాలని, గ్రామాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. నిధులకు ఏమాత్రం కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
దేశంలో ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ – సర్) పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.”2019లో దేశ జనాభా 130 కోట్లు ఉన్నప్పుడు 91 కోట్ల ఓట్లు ఉండేవి. 2024 నాటికి జనాభా 140 కోట్లకు పెరిగితే ఓట్లు 97.5 కోట్లకు చేరాయి. కానీ ఇప్పుడు ‘సర్’ పేరుతో దేశవ్యాప్తంగా కనీసం 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తొలగించారు. ఒక్క తెలంగాణలోనే 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారు” అని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక “గతంలో ‘సర్’ ప్రక్రియను ప్రజలకు కొత్తగా ఓటు హక్కు కల్పించేందుకు ఉపయోగించేవారని సీఎం గుర్తు చేశారు. కానీ ప్రధాని మోదీ ప్రభుత్వం మొదటిసారిగా దీనిని ఓట్ల తొలగింపునకు ఆయుధంగా వాడుకుంటోందన్నారు. మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్న దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళలు మరియు పొట్టకూటి కోసం వలసలు వెళ్లిన పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారన్నారు. కనీసం ఇంటి పేరు సరిగా లేకపోయినా యాంత్రికంగా ఓట్లను గల్లంతు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.
అమెరికాలో మహిళలకు ఓటు హక్కు రావడానికి 300 ఏళ్లు పట్టిందన్నారు. కానీ, దేశ పరిపాలన ఎవరు చేయాలన్నది ప్రజలే నిర్ణయించాలని నాడు మహాత్మా గాంధీ, నెహ్రూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావించి, స్వాతంత్ర్యం రాగానే దేశ ప్రజలందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించారన్నారు. ప్రస్తుతం బీజేపీ మాత్రం ఓటు హక్కు ఉన్నవాళ్లు, ఓటు హక్కు లేనివాళ్లు అంటూ దేశంలో రెండు రకాల ప్రజలను, ద్వితీయ శ్రేణి పౌరులను తయారు చేస్తోందన్నారు. నాడు బ్రిటిష్ హయాంలో ‘సైమన్ కమిషన్ గో బ్యాక్’ అని నినదించినట్లుగా, వందేళ్ల తర్వాత మోదీ తెచ్చిన ఈ విధానానికి వ్యతిరేకంగా ‘జ్ఞానేష్ కుమార్ గో బ్యాక్’ నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు ముందుకు రావాలన్నారు. ఎన్నికల వరకు వేచి చూడకుండా కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఓలు) ఇప్పటి నుంచే పూర్తి అప్రమత్తంగా ఉండి ఓట్లను కాపాడాలని పిలుపునిచ్చారు.
Also read: మాట నిలబెట్టుకున్న రేవంత్.. 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల రివార్డులు!
రాష్ట్రంలో, దేశంలో నెలకొన్న వాతావరణ మార్పులు, నీటి ఎద్దడిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయని, మన పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.రాబోయే 8 నెలల పాటు రాష్ట్ర ప్రజలకు తాగునీటిని అందించాల్సిన బాధ్యత ఉన్నదన్నారు. అందుకే ప్రాజెక్టులలో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సి ఉన్నదన్నారు.
వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు కూడా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సీఎం సూచించారు.వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా, ఎక్కడా కోతలు లేకుండా రైతులకు నాణ్యమైన కరెంట్ అందించి పంటలు ఎండిపోకుండా కాపాడుకున్నామన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదన్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ముందుచూపుతో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రణాళికల వల్లే నేడు దేశంలో విద్యాభివృద్ధితో పాటు మిగులు ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. ఎల్ నినో విపత్తును ఎదుర్కొనేందుకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల ప్రత్యేక సాయం అందించాలని, ఈ మేరకు పీఏసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు.
వందేళ్ల తర్వాత దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో తాము ఓబీసీ కులగణనను విజయవంతంగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన (సెన్సస్)లోనూ ఓబీసీ కులగణనను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పీఏసీ సమావేశం నుంచి తీర్మానం చేయడంతో పాటు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సీఎం సూచించారు.ఈ అంశంపై నాయకులంతా సీరియస్ గా మానిటరింగ్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. “గత ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ఏపీ ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రాజెక్టులను చేపట్టలేదు” అని సీఎం స్పష్టం చేశారు.ఇక పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తున్నామని సీఎం తెలిపారు.ఇప్పటికే చాలా మందికి నామినేటెడ్, పార్టీ పదవులు ఇచ్చామని, త్వరలోనే మిగిలిన మరికొందరికి కూడా పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా త్వరలోనే ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.
Also Read: తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి