Maoist Surrender: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడుతోందనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చే వారికి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు డీజీపీ ఆధ్వర్యంలో రూ.5.59 కోట్ల నగదు రివార్డులను పంపిణీ చేశారు. 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 824 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడారు. వీరిలో ఒక్క 2026లోనే 266 మంది పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం.
రివార్డులతో పాటు ఇళ్ల స్థలాలు, ఉచిత వైద్యం
లొంగిపోయిన 824 మందిలో 755 మందికి మొత్తం రూ.22.31 కోట్ల రివార్డులు మంజూరు అయ్యాయి. ఇప్పటివరకు 659 మంది ఖాతాల్లో రూ.17.68 కోట్లు జమయ్యాయి. మిగిలిన 96 మందికి ఆధార్, బ్యాంకు వివరాలు అందగానే నగదు చెల్లిస్తారు. కేవలం డబ్బు మాత్రమే కాకుండా, రాష్ట్రానికి చెందిన 57 మందికి నిమ్స్ ఆసుపత్రిలో ఫ్రీ వైద్యం కోసం ఆరోగ్య రక్షణ కార్డులు ఇచ్చారు. అలాగే, 59 మందికి గాను 10 మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగిలిన 49 మందికి స్థలాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
కర్రెగుట్టల్లో భారీ ఆయుధ డంప్ స్వాధీనం
మరోవైపు, ఈ ఏడాది మావోయిస్టుల నుంచి, కర్రెగుట్టలలోని 9 డంపుల నుంచి పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 48 ఏకే-47 రైఫిళ్లు, 37 ఇన్సాస్ రైఫిళ్లు, 4 ఎల్‌ఎంజీలు, 37 ఎస్‌ఎల్‌ఆర్‌లతో కలిపి మొత్తం 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్ ఉన్నాయి.
గణపతికి డీజీపీ బహిరంగ విజ్ఞప్తి
ప్రస్తుతం ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వారు కూడా హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: 3 ఏళ్లలో అన్యాయం జరిగింది.. రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై ఉత్తమ్ రియాక్షన్!