Uttam Kumar Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. తాను ఒక సంప్రదాయ కాంగ్రెస్ నాయకుడినని, గాంధీభవన్ తనకు రెండో ఇల్లు లాంటిదని ఆయన ఎమోషనల్ అయ్యారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్‌గా తాము పడిన కష్టమే ఇవాళ పార్టీని నిలబెట్టిందని గుర్తుచేశారు. ఎంతోమంది కార్యకర్తల చెమట, శ్రమ వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చేసారి ఎన్నికల్లో కూడా రెండోసారి అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తల ఆవేదన నాకు తెలుసు..
అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ న్యాయం జరగ లేదని ఉత్తమ్ కుమార్ ఒప్పుకున్నారు. గత కొంతకాలంగా కొందరికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పనిచేసిన చాలా మంది కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కలేదని అన్నారు. అలాంటి కష్టపడ్డ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కీలక సూచనలను పార్టీ ఇంచార్జికి అందించినట్లు ఆయన వెల్లడించారు.
సాగునీటి రంగంలో మాదే రికార్డు..
ఇక సాగునీటి రంగానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఉత్తమ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు, నెట్టెంపాడు, ఎస్ఎల్‌బీసీ (SLBC), సీతారామ వంటి కీలక ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే ఉండిపోయాయన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా, గోదావరి జలాలను అత్యధికంగా వినియోగించుకున్నామని తెలిపారు. ఆ నీటితో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంట దిగుబడి కూడా వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ కేవలం బోగస్ మాటలేనని కొట్టిపారేశారు. గత ప్రభుత్వం వదిలేసిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: అర్ధరాత్రి కాల్ చేసి బయటకు పిలిచి.. సింగరేణి ఉద్యోగి దారుణ హత్య!