
Revanth Reddy latest comments(Political news today telangana): తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. అమెరికాలో జరిగిన తానా సభలకు వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతల విమర్శలపై రేవంత్‌రెడ్డి స్పందించారు.
బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని మరోసారి నిరూపితమైందని రేవంత్ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం కాంగ్రెస్ చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షా కార్యక్రమాన్ని నీరు గార్చడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకే ఉచిత విద్యుత్ అంశంపైకి ప్రజల దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యత్ పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ఇవ్వడం లేదని ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుందని తెలిపారు.
9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.