Power Demand: గ్రేటర్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ వేడితోనే సమ్మర్ తరహా కరెంట్ డిమాండ్ కనిపిస్తోంది. మధ్యాహ్నం, రాత్రివేళల్లో ఉక్కపోతతో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర ఇండస్ట్రియల్ అవసరాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ భారీగా పెరుగుతోంది. తెలంగాణలో సెప్టెంబర్ 10న 19,543 మెగావాట్ల ఆల్‌టైమ్ పీక్ నమోదైంది. దేశవ్యాప్తంగా కూడా ఎల్‌నినో ప్రభావంతో వేడి పెరగడం, వర్షపాతం లోటు వల్ల ఆగస్టులో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. జలవిద్యుత్ ఉత్పత్తి కూడా వర్షాభావంతో తగ్గినట్టు క్రిసిల్ విశ్లేషణ చెబుతోంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న నీటి నిల్వలు తాగు, సాగునీటికే సరిపోతాయి. ఈ సీజన్ లో జలవిద్యుత్ శక్తి అంతంత మాత్రంగానే జెనరేట్ అయింది. ఇంకో ప్రమాదకరమైన సంకేతం ఏంటంటే.. భారత్ లో దాదాపు మూడో వంతు థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయ్. కరెంట్ డిమాండ్ పెరగడంతో నిల్వలను వేగంగా వాడేస్తున్నాయ్ పవర్ ప్లాంట్లు. సో ఇవన్నీ చూస్తే వచ్చే వేసవికి డిమాండ్ మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కరెంట్ కోతలు తప్పవా అన్న భయాలైతే ఉన్నాయి. కానీ సమస్యను గుర్తించి ముందస్తుగా ప్లాన్ చేయాల్సిందే. లేకపోతే సెప్టెంబర్ సిగ్నల్.. సమ్మర్ షాక్‌గా మారొచ్చు.