Medical Negligence: బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలతో వచ్చిన రోగికి కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో వైద్యం అందించడంలో విఫలమైన ప్రైవేట్ ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల రోగి ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారిస్తూ బాధిత కుటుంబానికి ఏకంగా రూ.43.36 లక్షల పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించింది.
సికింద్రాబాద్‌లోని వారసిగూడకు చెందిన ఎన్. దేవేందర్ రావు (52) అనే వ్యక్తికి 2013 మార్చి 22 మధ్యాహ్నం భోజనం తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే మధ్యాహ్నం 1:30 నుండి 2:00 గంటల మధ్య సదరు ఆసుపత్రిలోని సికింద్రాబాద్ బ్రాంచ్‌కు తరలించారు. ఆ తర్వాత అక్కడ నుండి జూబ్లీహిల్స్ లోని ప్రధాన ఆసుపత్రికి మార్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన పరిస్థితి క్షీణించి చివరకు అదే ఏడాది అక్టోబర్ 19న మరణించారు.
ఈ ఘటనపై బాధితుడి భార్య, కుమారుడు, కుమార్తె వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్ సభ్యులు మీనా రామనాథన్, కె. రంగారావు, వి.వి. శేషుబాబులతో కూడిన బెంచ్.. ఆసుపత్రి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. సికింద్రాబాద్ బ్రాంచ్‌కు సంబంధించిన అత్యవసర వైద్య రికార్డులను ఆసుపత్రి సమర్పించకపోవడాన్ని పసిగట్టింది. అలాగే జూబ్లీహిల్స్ ఆసుపత్రి కేస్ షీట్లలో నమోదు చేసిన సమయాలు, తేదీలలో తీవ్రమైన మార్పులు, కొట్టివేతలు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. స్ట్రోక్ వచ్చిన ప్రారంభ సమయంలో ఇవ్వాల్సిన కీలకమైన థ్రోంబోలసిస్ (Thrombolysis) చికిత్సను ‘సమయం దాటిపోయింది’ అనే నెపంతో నిరాకరించారని, సాయంత్రం వరకు ఎలాంటి అత్యవసర మందులు ఇవ్వలేదని రికార్డుల ద్వారా తేలింది.
బాధితుడికి ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల (బిపి, షుగర్, గుండె సమస్యలు) వల్లే ఆ చికిత్స చేయలేదని ఆసుపత్రి యాజమాన్యం వాదించింది. అయితే కేసు దాఖలైన తర్వాతే ఆసుపత్రి ఈ కారణాలను తెరపైకి తెచ్చిందని ఇది కేవలం తమ ఆలస్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్పిన సాకు మాత్రమేనని కమిషన్ కొట్టిపారేసింది. అంతేకాకుండా వైద్య రికార్డులను అత్యంత అధ్వాన్నంగా నిర్వహించినందుకు కూడా ఆసుపత్రిని తీవ్రంగా నిలదీసింది.
ఈ నిర్లక్ష్యానికి గాను ఆసుపత్రి యాజమాన్యం, సంబంధిత వైద్యులు.. బాధిత కుటుంబానికి రూ.43,36,000 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఆదాయ నష్టం కింద రూ.40.11 లక్షలు, రికార్డుల దుర్వినియోగానికి: రూ. 1 లక్ష, ఎస్టేట్ నష్టం కింద రూ. 1 లక్ష, కుటుంబ సభ్యులకు నష్టపరిహారం కింద రూ. 1 లక్ష, కోర్టు ఖర్చులకు రూ. 25 వేలు చెల్లించాలని ఉత్తర్వుల్లో ఆస్పత్రిని ఆదేశించింది.
Also Read: అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!
అత్యవసర సమయంలో వైద్యులు ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని లేనిపక్షంలో జరిగే నష్టానికి ఆసుపత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. వైద్య సేవలలో ఏవైనా లోపాలు ఎదురైతే బాధితులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ ‘1915’ లేదా తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హెల్ప్‌లైన్ నంబర్ ‘0771-2582902’ ద్వారా న్యాయం పొందవచ్చని అధికారులు సూచించారు.
Also Read: ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!