Rice Price: బియ్యం కొరత సృష్టించి, ధరలు పెంచుతున్న వారిపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు చేపట్టింది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు దాడులను ముమ్మరం చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ETF), తూనికలు-కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ) సంయుక్తంగా అక్టోబర్ 29 నుంచి 31 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించాయి.
ప్రజలను దోపిడీ నుంచి కాపాడటమే లక్ష్యంగా రిటైల్, హోల్‌సేల్ దుకాణాలపై ఈ దాడులు జరిగాయి. దీనిలో భాగంగా మొత్తం 18 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నారు, 11 కేసులు నమోదు చేశారు. ప్రజలను మోసం చేసేందుకు వ్యాపారులు చేస్తున్న అనేక అక్రమాలు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోల లేబుల్స్ వేసి తూకంలో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, కంపెనీ ముద్రించిన అసలు ధరల పైన ఎక్కువ రేట్లతో కొత్త స్టిక్కర్లను అతికించి అమ్ముతున్నట్లు పట్టుకున్నారు. ట్రేడ్, జీఎస్టీ (GST), లేబర్, FSSAI వంటి తప్పనిసరి లైసెన్సులు లేకుండానే చాలామంది వ్యాపారం చేస్తున్నారని తేలింది.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, దారి మళ్లించడం వంటివి కూడా అధికారులు గుర్తించారు. ప్రజలను మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహించదు అనడానికి ఈ దాడులే నిదర్శనం. అధికారులు కేవలం హెచ్చరికలతో సరిపెట్టలేదు. పదేపదే తప్పు చేస్తున్న వారిపై సరూర్ నగర్, జీడిమెట్ల, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో వెంటనే 11 ఎఫ్‌ఐఆర్‌లు (FIR) నమోదు చేశారు. ఈ వ్యాపారులపై నిత్యావసర వస్తువుల చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు పెట్టారు. ఈ చట్టాల ప్రకారం వీరికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తెలంగాణలోని ప్రతి పౌరుడికి నిత్యావసర సరుకులు సరైన ధరకు, పారదర్శకంగా అందాలన్నదే పౌరసరఫరాల శాఖ లక్ష్యం. ఇకపైనా ఇలాంటి మోసాలు జరగకుండా, నిరంతర నిఘా ఉంచి అక్రమార్కులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.
Also read: హోంమంత్రివా.. లేక గల్లీ మంత్రివా.. అమిత్ షా పై మంత్రి పోన్నం ఫైర్!