Medchal Land: ప్రభుత్వ భూ కేటాయింపుల ద్వారా నిరుపేదలకు లభించిన భూములను అక్రమ ఆక్రమణల నుంచి పరిరక్షించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ ఇటుక గోపి కోరారు. ఈ మేరకు బాధితులతో కలిసి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్‌కు రెండు వేర్వేరు ఫిర్యాదులు అందజేశారు.
కీసర మండలం దాయర గ్రామానికి చెందిన పుండ్రు నరసింహకు భూ సంస్కరణల చట్టంలోని సెక్షన్ 38-ఈ కింద సర్వే నంబర్ 194లో 13 గుంటలు, 195లో 34 గుంటల భూమి కేటాయించినట్లు బాధితులు తెలిపారు. అయితే కొందరు వ్యక్తులు సర్వే నంబర్ 196, గ్రామ పంచాయతీ లేఅవుట్‌తో ముడిపెట్టి ఆ భూములపై హక్కులు తమవేనంటూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని బెదిరిస్తూ భూమిని అనుభవించకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. దీంతో అక్టోబరు 8న జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా, అక్టోబరు 27న జిల్లా అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. సర్వే నంబర్లు 194, 195, 196 మధ్య హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమిని పరిరక్షించాలని కోరారు.
మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని సర్వే నంబర్ 281లో ఉన్న మూడు గుంటల వ్యవసాయ భూమిలో సంబంధిత యాదగిరి, ఆయన వారసుల అనుమతి, సంతకాలు లేకుండానే కొందరు వ్యక్తులు షెడ్డు నిర్మాణం చేపడుతున్నారని బాధితురాలు స్వర్ణలత ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి, భూమిని కాపాడాలని కలెక్టర్‌ను కోరారు.రెండు భూ వివాదాలపై సమగ్ర విచారణ చేపట్టి రెవెన్యూ రికార్డుల ఆధారంగా వాస్తవాలను నిర్ధారించాలని ఇటుక గోపి అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల కేటాయింపుల ద్వారా జీవనోపాధి పొందుతున్న పేద కుటుంబాలకు అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు మల్లేష్, సందాని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also Read: పిల్లి చేసే ఆ శబ్దం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉందా?