CM Progress Report: ఈవారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీబిజీగా గడిచింది. ఢిల్లీ పర్యటనల్లో కేంద్రమంత్రులకు విజ్ఞప్తులు, గోదావరి పుష్కరాలపై ముందస్తు ఏర్పాట్లు, సరికొత్తగా SLBC పనులు, రాష్ట్రానికి తగినంతగా యూరియా సప్లై, ఉద్యానపంటలకు ప్రోత్సాహం, కొత్త రైల్వే లైన్లపై ముందడుగు..
07-09-2025 ఆదివారం ( ఉద్యోగ సంఘాలకు గుర్తింపు )
రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్185 జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక 2016 మే 31న అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి జేఎస్‌సీని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ సంఘాల JAC డిమాండ్లలో ఇది ప్రధానమైనది. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన లేఖను ఉద్యోగ సంఘాల జేఏసీకి అధికారులు అందించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఈ ప్రభుత్వం ఇచ్చిందని JAC నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
08-09-2025 సోమవారం ( మూసీ మురిసేలా.. )
రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్బుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈనెల 8న గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ II & III కు శంకుస్థాపన చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపడం ద్వారా మూసీ నది పునరుజ్జీవం పథకానికి గండిపేట వద్ద సీఎం శంకుస్థాపన చేశారు. దాదాపు 7,360 కోట్ల వ్యయంతో రెండేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం గోదావరి నది నుంచి 20 టీఎంసీ నీటిని తరలించాలన్నది లక్ష్యం. అందులో జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 17.50 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను నింపడం, మరో 2.50 టీఎంసీల జలాలను మూసీ నది పునరుజ్జీవనానికి కేటాయిస్తారు. గోదావరి జలాలను తరలించే ఈ కార్యక్రమం ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించి నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు సీఎం రేవంత్.
08-09-2025 సోమవారం ( మేడారం, బాసర అభివృద్ధి కోసం)
మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు వంద రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న జరిపిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు.
09-09-2025 మంగళవారం ( గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం అడుగులు )
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కూడా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాజధానుల మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉందని గుర్తు చేశారు. తెలంగాణకు పోర్ట్ లేకపోవడంతో, బందరు పోర్ట్ వరకు సరకు రవాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్ లో 118 కిలోమీటర్లు తెలంగాణలో మిగతా భాగం ఏపీలో ఉంటుందని సీఎం వివరించారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ కు 90 శాతం భూ సేకరణ పూర్తయినందున వెంటనే ఫైనాన్షియల్, క్యాబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే హైదరాబాద్ శ్రీశైలంను లింక్ చేసే మన్ననూర్ – శ్రీశైలం హైవే విస్తరణకు ఆమోదించాలని, హైదరాబాద్ – మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. సీఆర్ఐఎఫ్ కింద 868 కోట్లతో పనులు చేయాలని కోరారు.
09-09-2025 మంగళవారం ( ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం )
తెలంగాణ విద్యా రంగంలో సమూల మార్పులు తేవడానికి తాము చేస్తున్నకృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 9న విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని పిల్లలకు కార్పొరేట్ తరహా విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 105 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు పాఠశాలల నిర్మాణ పనులు మొదలయ్యాయని, మిగతా పాఠశాలలకు సంబంధించి టెండర్లు ముగిశాయన్నారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు ఉంటారని, 2.70 లక్షల మంది విద్యార్థులకు ఈ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తుందని కేంద్రమంత్రికి వివరించారు. ఈ స్కూళ్ల నిర్మాణానికి 21 వేల కోట్ల ఖర్చవుతుందనన్నారు. ఈ నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతించడంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం పరిమితి నుంచి మినహాయించాలని కోరారు. విద్యా రంగంపై చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని కోరారు.
10-09-2025 బుధవారం ( నేపాల్ హెల్ప్ లైన్ )
నేపాల్‌లో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులను కాపాడడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఫోకస్ పెట్టి.. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశించారు. దీని ద్వారా నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మాండులోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం కో ఆర్డినేట్ చేస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.
10-09-2025 బుధవారం ( గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 10న మరోసారి విజ్ఞప్తి చేశారు. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో సమావేశమయ్యారు. మూసీ, ఈసా నదుల సంగమ స్థలంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టనున్న ప్రణాళికపై సీఎం వివరించారు. ఈ రెండు నదులు కలిసే చోట గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని, ఇందుకు అక్కడ ఉన్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా ప్రతిష్టాత్మకంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు, ల్యాండ్ స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామన్నారు. దీనికి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.
10-09-2025 బుధవారం ( సాదా బైనామాలకు మోక్షం )
సాదా బైనామా భూములున్న తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకున్న భూముల క్రమబద్ధీకరణకు ఈనెల 10న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 12-10-2020 నుంచి 10-11-2020 మధ్యకాలంలో దరఖాస్తు చేసుకున్న సాదాబైనామా భూములను రెగ్యులరైజ్ చేస్తారు. ఆగస్ట్ 26న హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది తెలంగాణ సర్కారు. ఈ పథకం కింద గరిష్టంగా 5 ఎకరాల వరకు కేవలం కాగితాలపై నమోదైన భూములను క్రమబద్దీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2 జూన్ 2014కు ముందు జరిగిన సాదాబైనామాలు ఈ రెగ్యులరైజేషన్ కు వీలవుతాయి. ఈ పథకం HMDA, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలోని భూములకు వర్తించదు. చిన్న, సన్నకారు రైతులకు 5 ఎకరాల వరకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే 5 ఎకరాలకు మించిన భూములకు ఈ రుసుములు చెల్లించాలి. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూమి యాజమాన్య హక్కులను చట్టబద్ధం చేయడం, పట్టాదార్ పాస్‌బుక్‌లు జారీ చేస్తారు.
11-09-2025 గురువారం ( కొత్త రైల్వే లైన్ల దిశగా అడుగులు )
తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను స్పీడ్ గా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్రానికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ప్రాజెక్టుల అలైన్‌మెంట్ ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం ఈనెల 11న సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్‌మెంట్ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. హైవే వెంట రైలుమార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు తగ్గట్లు హైదరాబాద్ - చెన్నై, హైదరాబాద్ – బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలన్నారు. వికారాబాద్ – కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని, దీంతో పాటు గద్వాల – డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు డెవలప్ చేయాలన్నారు.
12-09-2025 శుక్రవారం ( పుష్కరాలపై సమీక్ష )
గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షించారు సీఎం. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. 2027 జులై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల పరివాహకం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవాలన్నారు.
12-09-2025 శుక్రవారం ( ఉద్యాన పంటలకు ప్రోత్సాహం )
రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రజాప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రైతులకు ఇప్పటికే వివిధ రాయితీలు అందిస్తుండగా ఈ ఆర్థిక సంవత్సరం మరింతగా ప్రోత్సాహకం పెంచారు. కొత్త తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు మామిడి, అరటి, జామ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బత్తాయి వంటి పండ్ల తోటల సాగు కోసం 9,902 ఎకరాలకు 18.48 కోట్లు కేటాయించారు. అలాగే, కూరగాయల సాగు కోసం 10 వేల ఎకరాల లక్ష్యాన్ని సాధించడానికి 9.60 కోట్లు, 2,949 ఎకరాల్లో ఉల్లి సాగుకు 2.35 కోట్లు, 2,549 ఎకరాల్లో పూల సాగుకు 2.06 కోట్లు, 3,294 ఎకరాల్లో అల్లం, వెల్లుల్లి సాగుకు 5.33 కోట్లు కేటాయించారు. ఈ అన్ని విభాగాల్లో రైతులకు 40 శాతం రాయితీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. పుట్టగొడుగులు, పాత తోటల పునరుద్ధరణ, నీటి వనరుల సృష్టి, ప్లాస్టిక్ మల్చింగ్ కోసం విభాగాల్లో 40 నుంచి 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా, సేంద్రీయ సాగు, నర్సరీల ఏర్పాటు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీహౌజ్‌లు, కోల్డ్ స్టోరేజీలకూ సబ్సిడీలు అందిస్తోంది.
13-09-2025 శనివారం ( సరికొత్తగా SLBC పనులు )
SLBC పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ తో చాలా వరకు తాగు, సాగునీళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఉంది. అయితే ఇటీవలే సొరంగ పనుల్లో ప్రమాదం జరగడంతో పనులు ఆగిపోయాయి. దీంతో తాజాగా తవ్వకాల విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. టన్నెల్ బోరింగ్ మెషిన్ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోనుంది. డ్రిల్లింగ్&బ్లాస్టింగ్ పద్ధతిలో మిగిలిన సొరంగ పనులను పూర్తి చేయాలనుకుంటోంది. ట్రెడిషనల్ డ్రిల్లింగ్-బ్లాస్టింగ్ మోడల్ ద్వారా తవ్వాలని టెక్నికల్ కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆ దిశగానే ఆలోచన చేస్తోంది. గతంలో ప్రమాదం రాక్స్, నీటి లీకేజ్, భూమి పొరలు వదులుగా ఉండడంతో జరిగింది. D&B పద్ధతిలో భూగర్భ పరిస్థితులకు తగ్గట్లుగా పనులు జరపొచ్చు అని నిర్ణయానికొచ్చింది. తదుపరి క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెలకి 178 మీటర్లు తవ్వుతూ.. మిగిలిన 9 కిలోమీటర్ల పనులను పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్నారు.
13-09-2025 శనివారం ( యూరియా కొరత తీరేలా )
తెలంగాణలో యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు సాగించి, ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు యూరియాను తీసుకురావడంలో సక్సెస్ అయింది. తాజాగా ఒక్కరోజే 11,930 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయింది. గత రెండు రోజులలో 23 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా అయింది. మరో 4 రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతోంది. అటు రామగుండం RFCL ఎరువుల ఫ్యాక్టరీలో రిపేర్లు కంప్లీట్ చేసేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. అటు తెలంగాణలో రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల అన్నారు.
Story By Vidya Sagar, Bigtv