Telangana: డిసెంబర్ 9, 2024 నాడు సెక్రటేరియట్ లో “తెలంగాణ తల్లి” విగ్రహావిష్కరణ సందర్భంలో తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తిని అందించిన 9 మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ బహుమతిని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో చెక్కు రూపంలో అందించి వారి సేవలను కొనియాడారు. ఆ 9 మంది ప్రముఖుల వివరాలు ఒక్కసారి మన చూద్దాం.
గద్దర్
ప్రజా యుద్ధ నౌక “గద్దర్” గా ప్రసిద్ధి చెందిన ప్రజా పోరాట యోధుడు అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు (31 జనవరి 1949 – 6 ఆగస్టు 2023). కవి, గాయకుడిగా, కమ్యూనిస్ట్ విప్లవకారుడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడిగా ప్రజలందరిలో చైతన్యం కలిగించారు. ఆయన రాసి పాడిన “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా” పాత ఉద్యమ బావుటానై నిలిచింది.
గద్దర్ 1949లో తెలంగాణలోని మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో జన్మించాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, అతను దళిత పాంథర్స్ మరియు నక్సల్బరీ ఉద్యమం విప్లవాత్మక ఆలోచనలచే ప్రభావితమయ్యాడు. 2010 వరకు, గద్దర్ విప్లవ ఉద్యమంలో కొనసాగి, తరువాత తననుతాను అంబేద్కరైట్‌గా గుర్తించుకున్నాడు.
గూడ అంజయ్య
జానపద శైలిలో ప్రజా గీతాలను రచించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊతంగా నిలిచిన గేయ కవి. 1955లో ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో అంజయ్య జన్మించాడు. నలభై ఏళ్లు కవిగా, రచయితగా ఎన్నో కథలు, పాటలు రాసిన అంజయ్య రచనలలో “ఊరు మనదిరా” పాట 16 భాషలలో అనువాదమయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన రాసిన “అయ్యోనివా… అవ్వోనివా” అంటూ వలస పాలకులను ప్రశ్నిస్తూ.. యువతలో పోరాట స్పూర్తిని నింపారు.
ఆయన ‘పొలిమేర’ (నవల) ను, ‘దళిత కథలు’ పేరిట (కథా సంపుటి) ని ప్రచురించారు. “నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు”, “రాజిగా ఓరి రాజిగా”, “ఇగ ఎగబడుదాంరో ఎములాడ రాజన్న”, “లచ్చులో లచ్చన్న.. ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే”, “తెలంగాణ గట్టుమీద సందమామయ్యో”, వంటి పాటలు తెలంగాణ ప్రజలను ఉద్యమం వైపు ఉత్తేజపరిచాయి.
అందెశ్రీ
అందెశ్రీ గారు జూలై 18, 1961 లో వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. “పల్లెనీకు వందనములమ్మో”, “మాయమై పోతున్నడమ్మో మనిషన్నవాడు” మొదలగునవి ప్రసిద్ధమైనవి.
గోరటి వెంకన్న
గోరటి వెంకన్న ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. “వల్లంకి తాళం” పుస్తకానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు. గోరటి వెంకన్న 1963 లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (తెల్కపల్లి)లో ఆయన జన్మించాడు. రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలుపంచుకోసాగాడు.
అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు. “జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో” అనే పాట, అలాగే “కుబుసం” సినిమా కోసం ఆయన రాసిన “పల్లె కన్నీరు పెడుతోంది” అనే పాట, “పూసిన పున్నమి వెన్నెలలోన తెలంగాణ వీణ” పాటలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన రచనలలో ప్రముఖమైనవి. 1994 – ఏకనాదం మోత, 2002 – రేల పూతలు, 2010 – అల చంద్రవంక, 2016 – పూసిన పున్నమి, 2019 – వల్లంకి తాళం, రవినీడ, సోయగం, పాతకతే నా కథ, పల్గాడి
సుద్దాల అశోక్ తేజ
సుద్దాల అశోక్ తేజ 1960, మే 16 న యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో జన్మించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రముఖుడైన “సుద్దాల హన్మంతు” వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అశోక్ తేజ, సినీ రంగం వైపు దృష్టి మళ్ళిచారు. సుమారు 2000కి పైగా సినిమాల్లో 3000 పైచిలుకు పాటలు రాశారు. 2003లో వచ్చిన ఠాగూర్ సినిమాలోని “నేను సైతం” పాటకు 2014లో జాతీయ గీత రచయిత అవార్డును గెలుచుకున్నాడు. అశోక్ తేజ ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, సినీ గీత రచయితగా ప్రఖ్యాతి సాధించారు. ఇటీవలే “శ్రీ శూద్ర గంగా” పేరిట వచన రూప కావ్యాన్ని రచించారు.
జయరాజు
జయరాజు గారు మహబూబాబాద్ జిల్లా, మహబూబాబాద్ మండలం, గుమ్మనూర్ లో జన్మించాడు. జయరాజు గారి చదువంతా ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాగింది. మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చేస్తూ మధ్యలోనే ఆపి, కొత్తగూడెంలో ఐటీఐ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి చేయకముందే జయరాజు సింగరేణిలో ఫిట్టర్ గా ఉద్యోగంలో చేరారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎన్నోసార్లు జైలుకు వెళ్ళారు. జయరాజు గారు కవి, పాటల రచయిత, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారాన్ని, 2023లో కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. జయరాజ్ ప్రకృతి మీద 122 కథలు, గేయాలతో రాసిన ‘అవని’ పుస్తకం హిందీ, ఇంగ్గిష్, కన్నడ సహా అనేక భాషల్లోకి అనువాదమై విస్తృత ప్రాచుర్యం పొందింది. వారు రాసిన పాటలలో ‘వానమ్మ వానమ్మా.. వానమ్మ.. ఒకసారైన వచ్చిపోవే.. వానమ్మ..’ ప్రసిద్ధిచెందినది.
పాశం యాదగిరి
తెలుగు పత్రికా రంగంలో పేరెన్నిక గన్న జర్నలిస్టు, మేధావి, సామాజిక తాత్వికుడు. హైదరాబాద్ గౌలిగూడలో 1952 సంవత్సరం మార్చి 15న జన్మించారు. రాజకీయ విశ్లేషకుడిగా, పత్రికాధిపతిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రత్యేక ముద్ర ఆయనది.
ఎక్కా యాదగిరిరావు
ఎక్కా యాదగిరిరావు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శిల్పి, చిత్రకారుడు. హైదరాబాద్ పాత బస్తీ లోని అలియాబాద్‌లో జన్మించారు. తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారతీయ శిల్పకళను పరిశోధించి లోహ ‘మిథున’ శిల్పాన్ని రూపొందించారు. ‘మిథున’ శిల్పం యాదగిరిరావుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమితమైన గుర్తింపును తీసుకొచ్చింది.
నలిమెల భాస్కర్
నలిమెల భాస్కర్ గారు కవి, రచయిత, అనువాదకుడు, బహుభాషావేత్త, వ్యాసకర్త, తెలంగాణ భాషపై పరిశోధన చేసిన భాషానిపుణుడు. 1956 ఏప్రిల్ 1 న రాజన్న సిరిసిల్ల జిల్లా, యల్లారెడ్డిపేట్ మండలం, నారాయణపూర్‌లో జన్మించాడు. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సామెతలపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ చేశారు. తెలుగు, మళయాళ కుటుంబ సామెతలపై పరిశోధన చేసి అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. వారికి తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం,కన్నడం,మలయాళం, బెంగాలీ, అస్సామీ, ఒరియా, గుజరాతి, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ లు 14 భాషల్లో పట్టుంది. తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించాడు. అద్దంలో గాంధారి, మట్టిముత్యాలు, సుద్దముక్క వంటి 17 ప్రచురించారు. 2013 సంవత్సరానికి గాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.