CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిలో సాఫ్రన్ ఏరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ ఒక ముఖ్య మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ జీఎంఆర్ ఏరోపార్క్ (ఎస్ఈజెడ్) లో ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా రూపాంతరం చెందిందని చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బెంగళూరు–హైదరాబాద్‌ను డిఫెన్స్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ లాంటి సంస్థలు ఏరోస్పేస్ రంగంలో ముఖ్యంగా నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (MRO) సదుపాయాలతోపాటు, పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం సంతోషదాయకం అన్నారు. తెలంగాణపై నమ్మకంతో సాఫ్రన్ గ్రూపు ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలిపారు.
సాఫ్రన్ సుమారు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో నెలకొల్పిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికి పైగా నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లకు ఉపాధి లభిస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్. ఈ ఫెసిలిటీతో పాటు, సాఫ్రన్‌కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (MRO)కు శంకుస్థాపన చేయడం హర్షణీయం. ఈ MRO భారత వైమానిక దళం, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది రాఫెల్ ఇంజిన్ల కోసం భారత్ వెలుపల మొదటి M88 మిలటరీ ఇంజిన్ MRO అవుతుంది. ఇది రూ.450 కోట్ల పెట్టుబడితో 150 మంది టెక్నీషియన్లు, 600 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానించడంలో, పారిశ్రామికాభివృద్ధికి ప్రగతిశీల విధానాలను అవలంబిస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైంది. ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్‌లు భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఏరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. గత 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం విశేషం.
విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం పలికారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.