Sama Rammohan Reddy on KTR: రాష్ట్ర వ్యాప్తంగా ఈశ్వరచారి ఆత్మహత్య కేసు రాజకీయంగా పెను దుమారాన్ని సృష్టించింది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఈశ్వరచారి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు, దీనిపై ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య జరిగిన ట్వీట్ యుద్ధం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే.. ఈశ్వరచారి భార్య కవిత విడుదల చేసిన ఒక ఆడియో కాల్‌తో ఈ ఘటనకు సంబంధించి పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్థిక ఇబ్బందులు.. మల్లన్న సాయం:
మృతుడు ఈశ్వరచారి తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో.. భర్త పడుతున్న బాధలు చూడలేక, ఆయన భార్య కవిత… తెలంగాణ ఉద్యమకారుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ను ఆశ్రయించారు. కవితకు ఆర్థిక సహాయం చేస్తూ మల్లన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో, ఈశ్వరచారి తన బంధువుల నుంచి తీవ్రమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. ‘భార్య పరువు తీసింది’, ‘ఆర్థిక సహాయం తీసుకోవడం సిగ్గుచేటు‘ వంటి మాటలతో ఆయనను బంధువులు వేధించినట్టు తెలుస్తోంది. దీని వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఈశ్వరచారి, పరువు పోయిందని భావించి, తీన్మార్ మల్లన్న ఆఫీస్‌కు వెళ్లారు. మల్లన్నను కలిసి ఈ విషయంపై మాట్లాడాలని ప్రయత్నించినా, ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరాశకు గురై శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు.
కేటీఆర్ ట్వీట్ – సామ రామ్మోహన్‌రెడ్డి కౌంటర్:
ఈశ్వరచారి ఆత్మహత్య ఘటనపై వివరాలు పూర్తిగా తెలియకుండానే.. మాజీ మంత్రి కేటీఆర్ అదే రోజు స్పందించారు. ఈ ఆత్మహత్యకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలే అని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈశ్వరచారి మరణాన్ని ప్రభుత్వ హత్యగా అభివర్ణించారు.
బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నాడు.
పంచాయతీ ఎన్నికల్లో…
— KTR (@KTRBRS) December 5, 2025
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు సామ రామ్మోహన్‌రెడ్డి స్పందిస్తూ, “ఆత్మహత్యలపై కూడా రాజకీయం చేసే కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి” అని తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత అంశాలను రాజకీయం చేయడాన్ని ఖండించారు. బీసీ రిజర్వేషన్ల పట్ల నరనరాన వ్యతిరేకతను ఇతర రాష్ట్రాలకు వెళ్లి కేటీఆర్ తెలియేశారని ఆరోపించారు. అంతే కాకుండా బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నదని తెలిసినా .. బీజేపీ ని కాపాడడానికి కాంగ్రెస్ పైన విషం కక్కుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం, బీజేపీపై కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
బిసి సోదరులారా తస్మాత్ జాగ్రత్త..
ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే కల్వకుంట్ల గద్దలు మళ్ళీ వస్తున్నాయి..
బిసి రిజర్వేషన్ల పట్ల నర నరాన తన వ్యతిరేకతను ఇతర రాష్ట్రాలకి వెళ్ళి విషం కక్కిన కాలనాగు @KTRBRS . 👇
బిసి రిజర్వేషన్ల అంశం కేంద్రం దగ్గర పెండింగ్ ఉన్నదని తెలిసినా .. బీజేపీ ని… pic.twitter.com/OKWLYJ3im4
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) December 6, 2025
ఆడియో కాల్‌తో వెలుగులోకి వచ్చిన నిజాలు:
ఈ రాజకీయ దుమారం మధ్య, ఈశ్వరచారి భార్య కవిత ఒక ఆడియో కాల్‌ను విడుదల చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆడియోలో కవిత మాట్లాడుతూ.. తన భర్త మరణానికి కారణం బంధువుల నుంచి వచ్చిన అవమానాలే తప్ప, మరెవరూ కారని స్పష్టం చేశారు. మల్లన్న తనకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే చేశారని, ఆయనపై తమకు ఎలాంటి ద్వేషం లేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవమానాలు తన భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆత్మహత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.