HYDRAA: సరూర్‌నగర్ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. 140 ఎకరాలకు పైగా ఉన్న చెరువు పరిధిలో చాలా వరకు నివాసాలు వచ్చేశాయి. ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇంకా 90 ఎకరాలకు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామని చెప్పారు.
నగరంలో పెద్ద చెరువులను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిగారు సూచించారు. అందులో సరూర్‌నగర్ చెరువు కూడా ఉందన్నారు. ఈ క్రమంలోనే బుధవారం హైడ్రా కమిషనర్ సరూర్‌నగర్ చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి.. మార్చిలోగా పనులు చేపడతామన్నారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.
చెరువుల అభివృద్ధి అంటే పై మెరుగులు దిద్దడం కాదని ఇప్పటికే హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మకుంట, బమృకున్ – ఉద్ -దౌలా, కూకట్‌పల్లి నల్లచెరువులను పరిశీలిస్తే అందరికీ అర్థమౌతుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఆ దిశగానే సరూర్‌నగర్ చెరువును తీర్చిదిద్దుతామని చెప్పారు. చెరువులో 10 నుంచి 15 అడుగుల మేర పూడికను తొలగించి లోతు పెంచుతామన్నారు.
పూడికను తొలగించడం ద్వారా నీటి నిలువ సామర్థ్యం పెంచడమే కాకుండా.. భూగర్భ జలాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుందన్నారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సరిగా ఉండేలా చూస్తాం. మరీ ముఖ్యంగా వరదల నియంత్రణకు ఈ చెరువు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. మురుగు నీరు చెరువులో కలవకుండా వాటర్ బోర్డు సహకారంతో జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఎస్‌టీపీల సామర్థ్యాన్నిపెంచుతామన్నారు.
చెరువు పరిసరాల్లో పెద్దమొత్తంలో ఔషధగుణాలున్న మొక్కలు నాటడం, ఇప్పటికే ఉన్న ఇందిరా ప్రియదర్శని పార్కుతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ చెప్పారు. చెరువు చుట్టూ బండ్ తో పాటు వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా క్రీడా పార్కులు, అన్ని వయసుల వారూ వ్యాయామం చేసేందుకు అనువైన ఓపెన్ జిమ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు.
చెరువులోకి మంచి నీరు చేరడం వల్ల దుర్గంధ పరిస్థితులు పోయి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం సమకూరుతుందన్నారు. హైడ్రా కమిషనర్ సరూర్‌నగర్ చెరువును సందర్శించడం పట్ల లింగోజిగూడ, గడ్డి అన్నారం కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ప్రేమ్ మహేశ్వర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా చేపడితే చెరువు సర్వాంగ సుందరంగా మారుతుందని పేర్కొన్నారు. హైడ్రా కమిషనర్‌ను శాలువలతో సత్కరించారు. హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్యగారు, ఏసీపీ శ్రీ తిరుమల్ తదితర అధికారులు కమిషనర్ పర్యటనలో ఉన్నారు.
ALSO READ: రూ.2 కోట్ల ఆస్తిని దేవుడికి విరాళంగా ఇచ్చేసిన దంపతులు
సరూర్‌నగర్ చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
చెరువుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి మార్చిలోగా పనులు చేపడతామన్న కమిషనర్
ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని స్పష్టం
సరూర్‌నగర్ చెరువును పునరుద్ధరిస్తామని.. వరద… pic.twitter.com/jgkWy5m6oy
— BIG TV Breaking News (@bigtvtelugu) January 21, 2026