
Israel-Hamas War Latest news : హమాస్‌ను కూకటివేళ్లతో పెకిలించే లక్ష్యంతో 38 రోజులుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరింది. ఇప్పటికే పదుల సంఖ్యలో హమాస్ టాప్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్).. వారికి ఆయువు పట్టులాంటి టన్నెళ్ల వ్యవస్థను ఛేదించే ప్రయత్నాల్లో ఉంది.
గాజాలో ఆసుపత్రులను రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటూ వాటికి అడుగునే సొరంగాలు నిర్మించింది హమాస్. చిట్టడవిలాంటి టన్నెళ్ల వ్యవస్థను నేలమట్టం చేసేందుకు గాజా సిటీలోని ప్రధాన ఆస్పత్రులను ఐడీఎఫ్ చుట్టుముట్టింది. గాజాలో రెండు అతిపెద్దవైన అల్-షిఫా, అల్-ఖుద్స్ ఆస్పత్రులు వీటిలో ఉన్నాయి.
షిఫా ఆస్పత్రి సిబ్బంది, రోగులు సురక్షితంగా వెళ్లేందుకు ఉత్తరం వైపు సేఫ్ పాసేజిని ఏర్పాటు చేశామని ఐడీఎఫ్ తెలిపింది. మరో వైపు ఆస్పత్రి నుంచి శిశువులను తరలించే ప్రయత్నాల్లో ఉంది. గగనతల, భూతల దాడులతో హమాస్‌కు ఊపిరాడకుండా చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలు భూగర్భంలో యుద్ధానికి పూర్తిగా సన్నద్ధమైంది.
ఇప్పటికే పలు సొరంగాల ప్రవేశ మార్గాలను ఐడీఎఫ్ బలగాలు పసిగట్టేశాయి. ఇవి వందలు, వేల సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని గుర్తించేందుకు అత్యంతాధునిక సాంకేతికతను వినియోగించడం విశేషం. మొత్తం టన్నెల్ యాక్సెస్ పాయింట్లలో దాదాపు సగం పాయింట్ల సమాచారాన్ని టన్నెల్ వార్‌ఫేర్ యూనిట్ వీజిల్స్ సేకరించినట్టు సమాచారం.
ఒక్కో సొరంగ మార్గానికి పలు ప్రవేశ ద్వారాలను హమాస్ ఏర్పాటు చేయడం విశేషం. 500 కిలోమీటర్లకు పైగా విస్తరించిన సొరంగ మార్గ వ్యవస్థలోకి అన్యులు ప్రవేశించడమే కానీ.. బయట పడటమనేది అమిత దుర్లభం. చాలా సొరంగాలు అత్యంత రహస్యంగా.. నివాస సముదాయాలు, గ్యారేజీలు, పారిశ్రామిక వాడలు, వేర్‌హౌస్‌లు, చెత్తకుప్పల మాటున హమాస్ మిలిటెంట్లు ఏర్పాటు చేశారు.
వీటిని ఛేదించేందుకు ఇజ్రాయెల్ 2014 నుంచీ శ్రమిస్తోంది. గుర్తించిన సొరంగాలను, వాటి ఎంట్రన్స్ పాయింట్లను ఐడీఎఫ్ మ్యాపింగ్ చేయగలిగింది. వీటిలోకి ప్రవేశించడమంటే కత్తుల బోనులోకి అడుగుపెట్టినట్టే. లోపలికి వెళ్లే కొద్దీ జీపీఎస్ పరికరాలేవీ పనిచేయవు. ఇక శాటిలైట్ సిగ్నళ్లు కూడా మట్టిలోకి ప్రవేశించలేవు.
మాగ్నెటిక్ సెన్సర్లు, మూవ్‌మెంట్ సెన్సర్లు ఉన్న పరికరాలతో కొంత మేర ప్రయోజనం ఉంటుంది. వీజిల్స్ యూనిట్ సభ్యులు సొరంగాల్లోకి ప్రవేశించిన తర్వాత నైట్-విజన్ గాగుల్స్ వాడే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ల కోసం రేడియోలకు బదులుగా వందేళ్లనాటి ఫీల్డ్ టెలిఫోన్ టెక్నాలజీని వినియోగించాల్సి ఉంటుంది. టన్నెళ్లలో తమకు దారి చూపుతూ ముందుకు కదిలే రోబోలను కూడా సైనికులు వినియోగించే వీలుంది.
అయితే వీటి సేవలు సమతల ప్రదేశాల్లోనే లభించగలవు. నిచ్చెనలు ఎక్కడం, అవరోధాలను దాటడం వంటి పనులేవీ అవి చేయలేవు. ఒక్కో టన్నెల్‌ను దాటుకుంటూ ముందుకు సాగడం బలగాలకు అంత తేలిక కాదు. ఇప్పటికే హమాస్ మిలిటెంట్లు టన్నెళ్లలో బాంబులు అమర్చారు. తెలియక వాటిపై కాలు వేస్తే అంతే సంగతులు.
రిమోట్ సాయంతో పేల్చగల డిటొనేటర్లనూ అమర్చినట్టు తెలుస్తోంది. వెలుగు, కంపనం, శబ్దం, కదలికతో పేలగల ప్రత్యేక డిటొనేటర్లు వాటిలో ఉన్నాయి. ఆఖరికి కార్బన్-డై-ఆక్సైడ్ లెవెల్స్ పెరిగినా.. దానికి సైతం స్పందించి పేలగల డిటొనేటర్లను హమాస్ సమకూర్చుకుంది. టన్నెళ్లలో సైనికుల కదలికలను గుర్తించే, పరిశీలించే పరికరాలు సైతం మిలిటెంట్ల వద్ద ఉన్నాయి.
ఆ పరికరాల సాయంతో ఇజ్రాయెల్ సైనికులు ఉన్న ప్రాంతంలో గురి చూసి బాంబులను పేల్చగలదు హమాస్. ఇక విద్యుత్తు, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ల కోసం సొరంగవ్యవస్థలో వైర్లు, కేబుళ్లు ఉంటాయి. వాటిని కట్ చేసే ప్రయత్నం చేసినా ప్రమాదం తప్పదు. విద్యుత్తు సరఫరా నిలిచిపోతే పేలే డిటొనేటర్లను కూడా సొరంగాల్లో అమర్చినట్టు సమాచారం.
ఉపరితలంపై కన్నా భూగర్భసొరంగాల్లో బాంబులు పేలితే ప్రమాదం, చిక్కులు ఎక్కువ. ఒకవేళ పేలుడు నుంచి తప్పించుకున్నా.. దాని ఫలితంగా వెలువడే పొగతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడని పరిస్థితులు ఎదురు కావొచ్చు. సో.. హమాస్ సొరంగ వ్యవస్థ ఓ రకంగా పద్మవ్యూహం లాంటిదే. ఈ సాలెగూడు చిక్కుముళ్లను ఐడీఎఫ్ బలగాలు ఎలా ఛేదిస్తారో చూడాల్సిందే.